
వయసు పెరిగేకొద్దీ తరిగిపోయే జ్ఞాపకశక్తి
కాస్త కష్టపడితే మెమొరీ పవర్ మీ సొంతం
ప్రపంచ వ్యాప్త అధ్యయనాల సారాంశం ఇదే
సుప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ తరచూ ఫోన్ నంబర్లు మర్చిపోతూ ఉండేవారు. ఈ విషయంపై ఆయన ఒకసారి.. ‘టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే తెలుస్తుందిగా’ అని కూల్‌గా అన్నారట! అలాంటి జ్ఞానులు సాధారణ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏమీలేదని దీని సారాంశం. అయితే, మామూలు వ్యక్తులు మతిమరుపును అలా తీసేయడానికి వీల్లేదు. దానికి కారణాలేంటో గమనించి.. ఏ వయసులో ఎలాంటి సమస్యలు రావచ్చు.. వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి.
20లలో..
25 ఏళ్లు వచ్చేసరికి మెదడు పూర్తిగా వికసిస్తుంది. నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవటం, గుర్తుతెచ్చుకోవడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది. వయసు పెరిగేకొద్దీ మెదడు సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. ఈ తగ్గుదల దశాబ్దానికి స్వల్పంగా 5% వరకు ఉంటుందని మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడించింది.
30లలో..
మెదడు కణాల మధ్య సంకేతాలను ప్రసారం చేసే న్యూరో ట్రాన్స్‌మీటర్లు ముప్పైలలో తగ్గటం ప్రారంభిస్తాయి. జ్ఞాపకాల నిక్షిప్తానికి సాయపడే రసాయనమైన డోపమైన్.. వయసు పెరిగే కొద్దీ దశాబ్దానికి 10% మేర తగ్గుతుంది.
చేతి రాతే జ్ఞాపక మంత్రం!
ఎక్కువ కాలం గుర్తుండాలంటే టైప్ చేయడానికి బదులుగా చేతితో రాయండి. దీనివల్ల మెదడులో జ్ఞాపకశక్తికి, అవగాహనకు అనుసంధానమై ఉండే భాగాలు బాగా పనిచేస్తాయని ‘సైకలాజికల్ సైన్స్ జర్నల్’లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.
40లలో..
మధ్య వయసు నుంచి జ్ఞాపకశక్తి క్షీణించడం ప్రారంభమవుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (2012)లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. అధిక ఒత్తిడి సమయాల్లో అధికంగా విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ మెదడులో కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగాలను, ప్రక్రియను దెబ్బతీస్తుంది.
ప్రాసెస్డ్ మీట్ వద్దు
40 ఏళ్ల వయసులో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులను అతిగా తీసుకుంటే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గుతోందని ‘న్యూరాలజీ జర్నల్’లో ప్రచురితమైన ఓ పరిశోధన సూచిస్తోంది. శాకాహారం ఎక్కువగా, మాంసాహారం తక్కువగా తీసుకునే వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతల స్కోర్ ఎక్కువగా ఉందట. మాంసానికి బదులు నట్స్, బీన్స్ తీసుకుంటే ఈ ప్రమాదాన్ని 19% వరకు తగ్గించుకోవచ్చట.
50లలో..
మీరు ఎప్పుడైనా ఒక గదిలోకి వెళ్లి, మీరు దేనికోసం వెతుకుతున్నదీ మర్చిపోయారా? 50 ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమే. ఇందుకు కారణం మెదడులోని ‘రిఫ్రంటల్ కార్టెక్స్’ కుంచించుకుపోవడమే. సాధారణ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సామర్థ్యం 45–55 ఏళ్ల మధ్య గరిష్ట స్థాయికి చేరుతుంది. మెనోపాజ్ కారణంగా ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు ప్రభావితమవుతాయి. ఈ దశకు ‘బ్రెయిన్ ఫాగ్’ అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘క్రాకింగ్ ది మెనోపాజ్’ పుస్తక రచయిత్రి ఆలిస్ స్మెల్లీ పేరుపెట్టారు.
సానుకూల భావన
తాళాలను ఎప్పుడూ ఒకే చోట పెట్టడం, ఫోన్ లో రిమైండర్లు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోండి. సానుకూల భావనతో ఉండే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాల సారాంశం. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు.. పౌష్టికాహారం తీసుకుంటూ, ఒత్తిడికి దూరంగా ఉంటే జ్ఞాపకశక్తి బాగుంటుంది.
60లలో..
ఈ వయసులో తరచుగా.. వ్యక్తుల పేర్లు, పదాలు గుర్తుకురాక సతమతమవుతుంటారు. అంతమాత్రాన వీరు బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, కిక్కిరిసిన గ్రంథాలయంలో ఒక పుస్తకాన్ని దొరకపుచ్చుకోవటానికి సమయం పడుతుంది కదా.. అలాగే ఇదీనూ!
శారీరక శ్రమ
క్రమం తప్పకుండా బ్రిస్క్ వాకింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయాలి. వారంలో మూడు రోజులు ఇలా చేసే వృద్ధుల మెదడులోని జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్ సైజు ఏడాదికి 2% పెరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (2011) అధ్యయనంలో వెల్లడైంది.
70లలో..
కొన్ని పేర్ల జాబితా చదివిన కొద్ది నిమిషాల తర్వాత ఆ పేర్లు గుర్తుచేసుకునే సామర్థ్యం 20 ఏళ్ల వారితో పోల్చితే 70 ఏళ్ల వారిలో సగానికి తగ్గుతుంది. చిన్ననాటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోగలిగే వీరు.. నిన్న రాత్రి ఏం తిన్నారో మర్చిపోవచ్చు. దీనికి కారణం మెదడులో భావోద్వేగాల కేంద్రమైన ‘అమిగ్డలా’. యుక్తవయసు నాటి అనుభవాలు ఉద్వేగంతో కూడి ఉంటాయి కాబట్టి అమిగ్డలా సాయంతో వాటిని గుర్తు తెచ్చుకోగలుగుతారు.
కొత్త పనులు చేయండి
‘ద జర్నల్స్ ఆఫ్ జెరంటాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ ఒకే రకం కాకుండా, కొత్త పనులు ప్రయత్నించే, ఉత్సాహంగా ఉండే వృద్ధుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇనుమడించాయి.
80లలో..
జ్ఞాపకశక్తి వేగంగా తగ్గుతుంది. మెదడుకు రక్తాన్ని అందించే ధమనుల సామర్థ్యం తగ్గిపోవటం వల్ల మెదడుకు రక్తప్రవాహం, ప్రాణవాయువు సరఫరా మందగించటమే ఇందుకు కారణం. వినికిడి సమస్య వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇతరులు చెప్పేది వినటానికి అధిక శక్తిని మెదడు వినియోగించాల్సి రావటంతో, ఆ విషయాలను గుర్తుపెట్టుకోలేరు. ఒంటరితనం, కుంగుబాటు కూడా జ్ఞాపకశక్తిని క్షీణింపజేస్తాయి.
నలుగురితో కలవండి
ఇతరులతో ఎక్కువగా కలుస్తూ, కలివిడిగా ఉంటే యాక్టివ్‌గా ఉంటారు. బలమైన సాంఘిక సంబంధాలుండే వృద్ధుల జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం (2015). వినికిడి పరికరాలు వాడని వృద్ధులతో పోలిస్తే, వాడే వారిలో జ్ఞాపకశక్తి 50%కి పైగా మెరుగ్గా ఉందని ‘లాన్సెట్’ అధ్యయనం (2023).