ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వృద్ధి కారణంగా ఏర్పడిన గ్లోబల్ ఫ్లాష్ మెమరీ కాంపొనెంట్ల కొరత వల్ల ఎల్‌ఈడీ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఈడీ టీవీలు సహా అనేక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఫ్లాష్ మొమరీ కాంపొనెంట్ల తయారీలో కీలకంగా ఉన్న కంపెనీలు అధిక మార్జిన్ కలిగిన ఏఐ డేటా సెంటర్ల వైపు మళ్లడమేనని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్లాష్ మెమరీ ధరలు పెరుగుదల
LED టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్న ఫ్లాష్ మెమరీ ధరలు కొద్ది నెలల్లోనే భారీగా పెరిగాయి. వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం 1GB/8GB మెమరీ ధర ఏప్రిల్‌లో 2.61 డాలర్ల వరకు ఉండగా అక్టోబర్ నాటికి అది ఏకంగా 14.40 డాలర్లకు పెరిగింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ధరల పెరుగుదల 50 శాతానికిపైగా చేరాయి. ఇది టీవీ తయారీదారుల ఇన్‌పుట్ ఖర్చులపై ఒత్తిడి పెంచింది.
ఏఐ డిమాండ్: సాధారణ ఎలక్ట్రానిక్స్‌కు అంతరాయం
సెమీకండక్టర్ పరిశ్రమలోని ప్రధాన కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారించడమే ఈ కొరతకు మూలకారణం అని తెలుస్తుంది. చిప్ తయారీదారులు ఏఐ డేటాసెట్లలో ఉపయోగించే DDR6, DDR7 చిప్ సెట్‌ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కారణంగా టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల్లో సాధారణంగా వాడే DDR3, DDR4 మెమరీ ఉత్పత్తి తగ్గిపోయింది.
ఎస్‌పీపీఎల్(థామ్సన్ బ్రాండ్ లైసెన్స్) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ..‘2021-22 చిప్‌సెట్ కొరత తర్వాత ఫ్లాష్ మెమరీ అతిపెద్ద సమస్యగా ఉంది. త్వరలో ఎల్ఈడీ టెలివిజన్ ధరలు పెరుగుతాయి’ అన్నారు. ఈ మెమరీ కాంపోనెంట్స్ ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు 2026 కోసం మెమరీ సెట్‌లను భద్రపరచడానికి పోటీ పడుతుండటంతో సరఫరా గొలుసు అంతరాయాలు పెరిగి ధరల ఒత్తిడి మరింత తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొరత ఎప్పటివరకంటే..
ఈ కొరత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల వరకు కొనసాగుతుందని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీలు తమ ఆర్డర్లను వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇన్వెంటరీని క్రమబద్ధీకరిస్తున్నాయి.
టీవీలలో ఫ్లాష్ మెమరీని ఎందుకు ఉపయోగిస్తారంటే..
స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్ (webOS), టైజెన్ (Tizen) వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తాయి. ఈ OS కోడ్, టీవీని నడిపించే ఫర్మ్‌వేర్ (firmware) కోడ్ అంతా ఫ్లాష్ మెమరీలోనే శాశ్వతంగా నిల్వ అవుతుంది. టీవీని ఆన్ చేసినప్పుడు ఫ్లాష్ మెమరీలోని ఈ OS, ఫర్మ్‌వేర్ నుంచి డేటా లోడ్ అవుతుంది. అప్పుడే టీవీ పనిచేయడం మొదలవుతుంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix), యూట్యూబ్ (YouTube), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వంటి యాప్‌లను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడానికి ఫ్లాష్ మెమరీ స్థలాన్ని అందిస్తుంది.
ఇదీ చదవండి: రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు


