
ఇప్పుడిక కరెంట్ షాకివ్వక తప్పదు
భర్త హత్యకు ప్రియుడితో మహిళ ఫోన్ చాటింగ్
ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆమె సెల్ చాటింగ్ వివరాలు పోలీసులకు దొరికాయి. అందులో ఆమె..‘అతడికి ఆహారంలో చాలా నిద్రమాత్రలు కలిపి ఇచ్చాను. అయినా ఏమీ కాలేదు..బాగానే ఉన్నాడు. ఇప్పుడిక కరెంట్ షాకివ్వడమొక్కటే దారి. ఎంత సేపు షాకివ్వాలి?’అంటూ ప్రియుడిని సలహా అడిగింది. అందుకా ప్రియుడు..‘ముందుగా అతడి నోటిని, రెండు చేతులను టేప్‌తో కట్టేసి, ఆ తర్వాత కరెంట్ షాకివ్వాలి’అంటూ దారి చూపడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఉత్తమ్‌నగర్‌కు చెందిన కరణ్(36) భార్య సుశ్మిత, వరుసకు మరిది అయ్యే రాహుల్‌తో అక్రమ సంబంధం సాగిస్తోంది.
వీరిద్దరూ కలిసి కరణ్‌ను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈనెల 13వ తేదీన మాతా రూప్‌రాణీ హాస్పిటల్ నుంచి పోలీసులకు కరణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లు సమాచారం అందింది. కరణ్ కుటుంబీకులు తమకు సుశ్మితపై అనుమానం ఉందని, ఆమె రాహుల్‌తో సన్నిహితంగా ఉంటోందంటూ వివరించారు. పోలీసుల విచారణలో సుశ్మిత దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది.
ఈ నెల 12న రాత్రి సుశ్మిత సుమారు 15 నిద్రమాత్రలను కరణ్‌కు వడ్డించిన భోజనంలో కలిపినట్లు తెలిపింది. అయినా కరణ్ చనిపోలేదని రాహుల్‌కు తెలిపింది. అతడి సలహా మేరకు విద్యుత్‌షాక్‌కు గురిచేసింది. చనిపోయాడని నిర్థారించుకున్నాక సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. అంతా కలిసి కరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణానికి కారణం కరెంట్ షాకని శవపరీక్షలో తేలింది. అదేవిధంగా, కరణ్ సోదరుడు సుశ్మిత–రాహుల్‌లు ఇన్‌స్టాలో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులకు అందజేశాడు.