6 నుంచి 8 వారాల్లో థర్డ్‌ వేవ్‌..!

India could see third wave in 6-8 weeks - Sakshi

కోవిడ్‌ నిబంధనలను పాటించకపోతే మరో ముప్పు తప్పదు

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా.రణదీప్‌ గులేరియా హెచ్చరిక

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యమని, రాబోయే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ ప్రారంభం అయ్యే అవకాశాలు న్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. కరోనా మూడో వేవ్‌ కొన్ని నెలల్లో రావచ్చని అనేకమంది నిపుణులు హెచ్చరించిన పరిస్థితుల్లో గులేరియా అప్రమత్తంచేయడం గమనార్హం. అయితే ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించడం, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడ కుండా ఉండటం లాంటి జాగ్రత్తలను ఏమేరకు అవ లంభిస్తారనే దానిపై థర్డ్‌ వేవ్‌ రాక ఆధారపడి ఉంటుందని  ఆయన వ్యాఖ్యానించారు. ‘కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రజలు బయటికి రావడం, కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం, ఒకే దగ్గర గుమిగూడడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్‌ వేవ్స్‌ నుంచి ప్రజలు ఏమీ నేర్చుకున్నట్లు లేదు’ అని ఆయన అన్నారు.

డెల్టా వేరియంట్‌ ప్రభావం
‘ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ గతంలోని వేరియంట్స్‌తో పోలిస్తే మరింత బలమైంది. దీని సంక్రమణ వేగం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. యూకేలో
డెల్టా వేరియంట్‌ మ్యూటేషన్‌ చెందుతోంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కరోనా
వేవ్స్‌ మధ్య గ్యాప్‌ తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు.

అధునాతన పరిశోధనశాలలు
వైరస్‌ ఎలా ప్రవర్తిస్తుందో చూడటానికి మనకు అగ్రెసివ్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అవసరం. వ్యాక్సిన్‌ సామర్థ్యం తగ్గుతుందా, మోనోక్లోనల్‌ యాంటీ బాడీ చికిత్స పని చేస్తుందా? అనే డేటాను అధ్యయనం చేసేందుకు అధునాతనమైన పరిశోధనశాలల వ్యవసలు ఉండాలి.

పాజిటివిటీ రేటు 5% దాటితే మినీ లాక్‌డౌన్‌
‘ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఏ ప్రాంతంలోనైనా 5% మించి పాజిటివిటీ రేటు నమోదైతే మినీ లాక్‌డౌన్‌ విధించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. హాట్‌స్పాట్‌లలో కరోనా టెస్ట్‌లు చేయడం, సంక్రమణ ట్రాకింగ్‌తో పాటు చికిత్సపై దృష్టి పెట్టాలి’ అని గులేరియా అన్నారు.

కొత్త వ్యూహాలను అనుసరించాలి
‘కరోనా కొత్త వేవ్‌ ప్రభావం మొదలుకావడానికి సాధారణంగా మూడు నెలలు పడుతుంది. కానీ వివిధ అంశాల ప్రభావంతో తక్కువ సమయంలో దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు కోవిడ్‌ నిబంధనలను పాటించాలి. బయటి వేరియంట్‌ భారత్‌లో వ్యాప్తి చెంది పరివర్తన చెందింది. అందుకే కరోనా హాట్‌స్పాట్‌లపై నిఘా పెంచాలి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ల మధ్య అంతరాల పెరుగుదల తప్పేం కాదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరించాలి’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top