భారత్‌–చైనామధ్య 13వ దఫా చర్చలు

India, China to Hold 13th Round of Military Talks at Moldo Border - Sakshi

భారత్‌–చైనామధ్య 13వ దఫా చర్చలు

నేడు మిలటరీ ప్రతినిధుల భేటీ

బలగాల ఉపసంహరణే లక్ష్యం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 13వ దఫా చర్చలు జరపనున్నాయి. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తూర్పు లద్దాఖ్‌ ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్‌ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయని వెల్లడించాయి. భారత బృందానికి లెహ్‌లోని 14 కారప్స్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ నాయకత్వం వహించనున్నారు.

డెప్సాంగ్, డెమ్‌చోక్‌ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి, మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్‌ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది. 12వ విడత చర్చలు జూలై 31వ తేదీన జరిగాయి. ఫలితంగా కీలకమైన గోగ్రా పాయింట్‌ నుంచి రెండు దేశాల ఆర్మీ ఉపసంహరణ పూర్తయింది.

చైనా మోహరింపులు ఆందోళనకరం
ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా మిలటరీ మోహరింపులు కొనసాగించడం, మౌలిక వసతులను పెంచుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే అన్నారు. ఇండియాటుడే కాంక్లేవ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. శీతాకాలం ఆసాంతం బలగాల మోహరింపులను చైనా కొనసాగించాలని చూస్తే, పాకిస్తాన్‌ వైపు ఎల్‌వోసీ (నియంత్రణ రేఖ) వెంబడి వంటి పరిస్థితికి దారితీయవచ్చని భావిస్తున్నామన్నారు.

ఆ దేశ మిలటరీ పీఎల్‌ఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ ఆరీ్మ)కదలికలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. చైనా సైన్యానికి సరితూగే స్థాయిలో భారత్‌ కూడా బలగాల మోహరింపులను కొనసాగిస్తుందని, ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచమంతటా కోవిడ్‌ మహమ్మారి తీవ్రత కొనసాగుతుండటం, దక్షిణ చైనా సముద్రంలో ఒక వైపు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా..మరో వైపు భారత్‌తో ప్రతిష్టంభనను ఎందుకు కొరుకుంటోందనేది అర్థం కాని విషయమన్నారు. ఏదేమైనప్పటికీ తూర్పు లద్దాఖ్‌ ప్రతిష్టంభనతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు.

కశ్మీర్‌లో పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. అఫ్గాన్‌ ఉగ్రవాదులు కశీ్మర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చెలాయించిన సమయంలోనూ అక్కడి ఉగ్రమూకలు కశీ్మర్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు, ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు మన బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి, ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు కశీ్మర్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో సంబంధం ఉన్నట్లు భావించడం లేదని తెలిపారు. లోయలో అశాంతిని ప్రేరేపించాలని కుట్రపన్నిన ఉగ్రమూకలు చివరి ప్రయత్నంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాయన్నారు.

స్వేచ్ఛా నౌకాయానమే కీలకం: రాజ్‌నాథ్‌
భారతదేశ అభివృద్ధి స్వేచ్ఛా నౌకాయానంతోనే ఎక్కువగా ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఎంతోకాలం నుంచి సముద్రంతోనే మనకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. మన వాణిజ్యం, ఆరి్థక వ్యవస్థ, మన పండుగలు, సంస్కృతి సముద్రంతోనే సాన్నిహిత్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, సముదప్రాంతానికి సంబంధించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం’ అని శనివారం జరిగిన భారత తీర రక్షక దళం(ఐసీజీ) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సముద్రయాన భద్రత లేకుండా, దేశానికి సమగ్ర రక్షణ వ్యవస్థను సాధించడం అసాధ్యమన్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top