ఒక్కరోజులో 2.26 కోట్ల డోసులు

India administers record 2 crore Covid vaccines as govt - Sakshi

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ కొత్త రికార్డు

ప్రధాని మోదీకి జన్మదిన కానుక

న్యూఢిల్లీ:  కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో భారత్‌ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం దేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. అత్యధికంగా కర్ణాటకలో 26.9 లక్షల డోసులు, బిహార్‌లో 26.6 లక్షల డోసులు, ఉత్తరప్రదేశ్‌లో 24.8 లక్షల డోసులు, మద్యప్రదేశ్‌లో 23.7 లక్షల డోసులు, గుజరాత్‌లో 20.4 లక్షల డోసులు ఇచ్చారు.

ఈ రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌ ప్రధానమంత్రికి ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజల తరపున తాము అందజేసిన జన్మదిన కానుక అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా ట్వీట్‌ చేశారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒక్క రోజులో కోటికిపైగా డోసులు ఇవ్వడం గత నెల  వ్యవధిలో ఇది 4వసారి కావడం విశేషం.  

ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ..
ప్రధానమంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, టిబెట్‌ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాలు శుభాకాంక్షలు తెలిపారు.

సేవా ఔర్‌ సమర్పణ్‌..
ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్‌ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 20 రోజులపాటు సాగే ‘సేవా ఔర్‌ సమర్పణ్‌’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌ 7 దాకా దేశవ్యాప్తంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడతారు. 14 కోట్లకుపైగా రేషన్‌ కిట్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు.  1950 సెప్టెంబర్‌ 17న గుజరాత్‌లో జన్మించిన నరేంద్ర మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. అనంతరం బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

ప్రతి భారతీయుడికి గర్వకారణం: మోదీ
దేశంలో ఒక్కరోజులో 2.26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో పాల్గొన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కృషి మరువలేనదని ప్రశంసించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top