మలుపు మిస్సైంది.. కళ్లు మూసి తెరిచేలోపే! | UP Horror: Missed Exit Turns Deadly | Sakshi
Sakshi News home page

మలుపు మిస్సైంది.. కళ్లు మూసి తెరిచేలోపే!

Jun 29 2026 7:22 AM | Updated on Jun 29 2026 11:17 AM

UP Horror: Missed Exit Turns Deadly

గమ్యం చేరాల్సిన కారు... క్షణాల్లో మృత్యువుకు చిరునామాగా మారింది. హైవేపై జరిగిన ఒక్క చిన్న పొరపాటు.. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన మరో బండి.. వెరసి ఒకే కుటుంబాన్ని విషాదంలో ముంచేశాయి. కళ్లుమూసి తెరిచేలోపే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక ప్రమాదం సీసీటీవీలో రికార్డవడంతో ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌ వద్ద జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. హైవేపై మలుపు మిస్సవడంతో కారును రివర్స్‌ తీస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో ఎస్‌యూవీ ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

హర్యానాలోని సోనీపట్‌ జిల్లా బహదూర్‌గఢ్‌కు చెందిన చరణ్‌సింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు హరిద్వార్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో మలుపు దాటిపోవడంతో వారి టాటా టియాగో కారును హైవేపైనే రివర్స్‌ తీసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో ఎస్‌యూవీ కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని మరోవైపు ఎగిరిపడింది. ఎస్‌యూవీ కూడా అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం డెహ్రాడూన్‌–పంచకులా హైవేపై రాంపూర్‌ మనిహరన్‌ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భయానక ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

ప్రమాదంలో చరణ్‌సింగ్‌, ఆయన భార్య సుదేశ్‌, కోడలు ప్రీతి, మనవడు శివాంశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు హైవేపై రివర్స్‌ తీసేందుకు చేసిన ప్రయత్నమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement