మౌంట్‌ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం | Hill Station Mount abu Cold Wave Fog Alert | Sakshi
Sakshi News home page

మౌంట్‌ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం

Dec 18 2024 9:01 AM | Updated on Dec 18 2024 9:29 AM

Hill Station Mount abu Cold Wave Fog Alert
  • రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో గడ్డకట్టేంతటి చలి

  • హిల్ స్టేషన్ మౌంట్ అబూలో  4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

  • ఇంతటి చలిలోనూ మౌంట్‌ అబూకు క్యూ కడుతున్న జనం

  • పర్యాటకులను ఆకర్షించే అచల్‌ఘర్ కోట

  • మధురానుభూతులను పంచే సన్‌సెట్‌ పాయింట్‌

జైపూర్‌: రాజస్థాన్‌లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గడ్డకట్టేంత చలి  ఉంటోంది. రాజధాని జైపూర్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల దిగువకు పడిపోయింది. ఇక్కడి హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇంతటి చలిలోనూ మౌంట్‌ అబూను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ మౌంట్‌ అబూలో చూసేందుకు ఏమున్నాయి?

రాజస్థాన్‌లోని ‍ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అక్కడి సంస్కృతి, ప్రజల జీవనశైలి, సంప్రదాయ వారసత్వం  ఎవరినైనా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని మౌంట్‌ అబూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్. నిత్యం ఇక్కడ పర్యాటకుల సందడి కనిపిస్తుంది. చరిత్రలోని వివరాల ప్రకారం సిరోహి మహారాజు ఒకప్పుడు మౌంట్ అబూను బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చాడు. దీంతో బ్రిటీషర్లు మౌంట్‌ అబూను తమ వేసవి విడిదిగా మార్చుకుని, అభివృద్ధి చేశారు.  

అచల్‌ఘర్ కోట
మౌంట్ అబూలోని అచల్‌ఘర్ కోట  ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.  హిల్ స్టేషన్‌కు ఈ కోట అందాన్ని తీసుకువస్తుంది. ఈ కోటను మావద్ రాణా కుంభ్ నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై ఉంది. ఇక్కడ నుండి కిందనున్న పట్టణాన్ని చూడవచ్చు. కోటలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది.  ఆలయంలో కొలువైన శివునికి ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూజలు నిర్వహిస్తుంటారు.

సన్‌సెట్‌ పాయింట్‌
హిల్ స్టేషన్లలో సూర్యోదయం- సూర్యాస్తమయం పాయింట్లు ఎంతో ముచ్చటగొలుపుతాయి. ఇదేవిధంగా మౌంట్‌ అబూపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మధురానుభూతులను అందిస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.

టోడ్ రాక్
మౌంట్ అబూలో  తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి టోడ్ రాక్. ఇదొక భారీ రాయి. ఈ రాయి ఆకారం కప్ప మాదిరిగా ఉంటుంది. ఈ రాతికప్ప నదిలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. టోడ్‌ రాక్‌ను చూసినవారు ఆశ్చర్యానికి గురవుతుంటారు.

 

నక్కీ సరస్సు
ఈ సరస్సును దేవతలు  స్వయంగా తవ్వారని చెబుతుంటారు. ఈ సరస్సులోని నీరు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. నీటిపై మంచు ఒక షీట్ మాదిరిగా విస్తరించివుంటుంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ సరస్సు ఇక్కడి ప్రకృతి అందాలకు పరాకాష్టగా నిలుస్తుంది. సాయంత్రం సమయాన ఈ సరస్సును చూడటం ప్రత్యేక అనుభూతని అందిస్తుంది.

ఎలా వెళ్లాలి?
మౌంట్‌ అబూకు పలు రవాణా మార్గాలలో చేరుకోవచ్చు. ఇక్కడికి  185 కి.మీ దూరంలో ఉదయపూర్‌ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీని పట్టుకుని మౌంట్‌ అబూను చేరుకోవచ్చు. అలాగే ఇక్కడికి సమీపంలో అబూ రోడ్‌ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఢిల్లీ నుంచి నేరుగా మౌంట్‌ అబూకు బస్సులు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement