HC Verdict On Hijab Controversy: హిజాబ్‌పై హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది.. కేంద్రం సహా పలువురి స్పందన ఇది!

Hijab Verdict: Centre State Govt Welcomes Karnataka HC Verdict - Sakshi

నెలరోజుల ఘర్షణ వాతావరణానికి, ఉద్రిక్తతలకు తెరదించుతూ కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఐదు వ్యాజ్యాలను కొట్టేసిన కోర్టు ‘హిజాబ్‌ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాద’ని తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఇదిలా ఉండగా.. హిజాబ్‌ తీర్పుపై కేంద్రం తరపున హర్షం వ్యక్తం అయ్యింది. ‘‘కోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. దేశం ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ శాంతిని పాటించాలి.. కోర్టు తీర్పును గౌరవించాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదవుకోవడం. కాబట్టి, ఇవన్నీ పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా చదువుకోండి‌’’ అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్డర్‌ కాపీలో అంశాల ప్రకారం.. హిజాబ్‌ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హఠాత్తుగా అదీ అకడమిక్‌ ఇయర్‌ మధ్యలో.. హిజాబ్‌ వివాదం ఎలా పుట్టుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేసిన బెంచ్‌.. దీనివెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేసింది.    

ప్రభుత్వాలదే అధికారం: హైకోర్టు 
కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. వ్యక్తిగత ఎంపిక కంటే సంస్థాగత క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 యొక్క వివరణలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. బహుశా అందుకే కోర్టు హిజాబ్‌పై ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని అడ్వొకేట్‌ జనలర్‌ ప్రభూలింగ్‌ నవద్గి అభిప్రాయపడ్డారు. 

మరోవైపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ ‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది. 

హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది.  

కర్ణాటక ప్రభుత్వ స్పందన ఇది
మరోవైపు హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ మెయింటెన్‌ చేస్తూనే.. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువును పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారాయన. ఇక కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్‌ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని కర్ణాటక హైకోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని నేను అభ్యర్థిస్తున్నాను, ఇతర విషయాల కంటే చదువు ముఖ్యం అని అన్నారాయన. 

కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. కోర్టు తీర్పుపై పలువురు నేతలు, ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top