బెంగళూరు ఆస్పత్రికి వరుణ్‌ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం

Helicopter Crash Captain Varun Singh Shifted To Bengaluru Hospital - Sakshi

కోయంబత్తూర్‌: హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ను మరింత మెరుగైన చికిత్స కోసం గురువారం బెంగళూరుకు తరలించారు. ఊటీ వెల్లింగ్టన్‌ మిలిటరీ ఆస్పత్రి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా సాయంత్రం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కమాండ్‌  ఆస్పత్రికి తరలించారు. కాగా, వరుణ్‌ ఆరోగ్య పరిస్థితిపై కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్, సీఎం బసవరాజ్‌ బొమ్మైలు వివరాలు అడిగి తెల్సుకున్నారు.

అంతకుముందు వరుణ్‌ తండ్రి రిటైర్డ్‌ కల్నల్‌ కేపీ సింగ్‌ మాట్లాడారు. తానిప్పుడే వెల్లింగ్టన్‌కు వచ్చానని చెప్పారు. వరుణ్‌ను బెంగళూరుకు తీసుకువెళ్తున్నారని ధృవీకరించారు. వరుణ్‌ పరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేనన్నారు. వరుణ్‌ ప్రమాద వార్త తెలిసినప్పుడు ఆయన తల్లిదండ్రులు ముంబైలోని తమ చిన్న కుమారుడు లెఫ్టినెంట్‌ కమాండర్‌ తనూజ్‌ వద్ద ఉన్నారు. గతంలో వరుణ్‌ తృటిలో మృత్యువాత నుంచి బయటపడిన సంగతిని గుర్తు చేసుకున్నారు.  

ఎలా ఉన్నారు? 
వరుణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వెల్లింగ్టన్‌లో ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుల బృందం తెలిపింది. కొందరు అధికారులు ఆయనకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని చెబుతుండగా, తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు మాత్రం ఆయనకు 80–85 శాతం కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ సీరియస్‌గానే ఉందన్నది నిర్విదాంశం. ఆయన్ను లైఫ్‌ సపోర్టు వ్యవస్థపై ఉంచి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు తెలిసింది. మరోవైపు వరుణ్‌ కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ప్రార్ధించారు.

చదవండి: 
చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్‌ రావత్‌
హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top