సంచలన విషయాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

Health Ministry Herd Immunity from Coronavirus Not For India - Sakshi

హ్యూమన్‌ ట్రయల్స్‌ దశలో 2 వ్యాక్సిన్‌లు

ప్రతిరోజూ సగటున 4,68,263 కరోనా పరీక్షలు

రికవరీ రేటు 7.85- 64.44 శాతానికి పెరుగుదల

భారత్‌లో కరోనా మరణాలు 2.21శాతం  

న్యూఢిల్లీ: భారత్‌ లాంటి అధిక జనాభా గల దేశంలో సాధారణ ప్రక్రియలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది ఓ వ్యాధి నుంచి కాపాడే పరోక్ష రక్షణ పద్దతి. ఈ విధానం జనాలను జబ్బుల నుంచి కాపాడుతుంది. అది ఎప్పుడంటే గతంలో ఆ జనాభా అదే వ్యాధి నుంచి కోలుకున్నప్పుడు.. లేదా దానికి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భారతదేశానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ అనే ఆప్షన్‌ ఇప్పుడు పనికిరాదు. వ్యాక్సిన్‌ లేకుండా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడం చాలా ఖర్చుతో కుడుకున్న ప్రక్రియ. ఇప్పుడే దీన్ని అమల్లోకి తేస్తే.. కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇది ఆరోగ్య మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేస్తుంది. ఎందరినో బలి తీసుకుంటుంది. భవిష్యత్తులో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన తర్వాతనే హెర్డ్‌ ఇమ్యూనిటీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనాను ఎదుర్కొవాలి’ అన్నారు రాజేష్‌ భూషణ్‌. (వాక్సిన్‌: భారతీయ కంపెనీలపై ప్రశంసలు)

హ్యూమన్‌ ట్రయల్స్‌ దశలో 2 వ్యాక్సిన్‌లు
ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేస్తోన్న రెండు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు మొదటి, రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌లో ఉన్నాయన్నారు రాజేష్‌ భూషణ్‌. హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్ల కోసం ప్రవేశపెట్టిన 50 లక్షల రూపాయల కోవిడ్‌-19 బీమా పథకం కింద ఇప్పటికే ప్రభుత్వానికి 131 క్లెయిమ్‌లు వచ్చాయని తెలిపారు. వీటిల్లో 20 కేసుల్లో చెల్లింపులు పూర్తికాగా.. 64 కేసులు ప్రాసెసింగ్‌లో ఉన్నాయని.. మరో 47 కేసులు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయన్నారు. మెరుగైన పరీక్షా మౌలిక సదుపాయాల కారణంగా.. జూలై 26 నుంచి 30 వరకు ప్రతిరోజూ సగటున 4,68,263 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాజేష్‌ భూషణ్‌ తెలిపారు. కోవిడ్‌-19 రోగులలో రికవరీ రేటు కూడా ఏప్రిల్‌లో 7.85 శాతం నుంచి గురువారం(నేడు) నాటికి 64.44 శాతానికి పెరిగిందన్నారు. ఇది ఎంతో ఊరట కలిగించే విషయం అన్నారు రాజేష్‌ భూషణ్‌. (హాట్‌స్పాట్‌గా మారనున్న బెంగళూరు?!)

అంతేకాక 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉండగా, నాలుగింటిలో ఐదు శాతం కన్నా తక్కువ అని భూషణ్ తెలిపారు. రాజస్తాన్‌లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు 3.5 శాతం, పంజాబ్‌లో 3.9 శాతం, మధ్యప్రదేశ్‌లో 4 శాతం, జమ్మూకశ్మీర్‌లో 4.7 శాతం ఉందని రాజేష్‌ భూషణ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు భారత్‌లోనే తక్కువన్నారు. కరోనా మరణాల్లో ప్రపంచ సగటు 4 శాతం ఉండగా.. భారత్‌లో 2.21శాతంగా ఉన్నట్లు రాజేష్‌ భూషణ్‌ తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top