వరవరరావుకు ఊరట

HC extends temporary bail of Varavara Rao till Oct 28 - Sakshi

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌–మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన కవి, సామాజిక ఉద్యమకారుడు వరవరరావు(82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఈ నెల 28 దాకా తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలి్సన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్‌ గడువును పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ చేపడతామని వెల్లడించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్‌ 5న లొంగిపోవాల్సి ఉండగా, బెయిల్‌ గడువును పెంచాలని విజ్ఞప్తి చేస్తూ గత నెలలో పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, బెయిల్‌ గడువును పెంచాలన్న వరవరరావు వినతిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వ్యతిరేకించింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరవరరావు ప్రస్తుతం ముంబైలో భార్యతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్‌ గడువును పొడిగించాలన్న వరవరరావు విజ్ఞప్తి పట్ల న్యాయస్థానం గురువారం సానుకూలంగా స్పందించింది. ఈ నెల 28 దాకా లొంగిపోవాలి్సన అవసరం లేదని వెల్లడించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top