breaking news
Taloja Central Jail
-
అబూ సలేంకు ముంబై స్పెషల్ కోర్టు ఊరట
ముంబై: ముంబై(1993) బాంబు పేలుళ్ల నిందితుడు అబూ సలేంను ఊరట లభించింది. తలోజా సెంట్రల్ జైలు నుంచి మరో జైలుకు తరలించవద్దని ముంబై స్పెషల్ కోర్టు ఆదేశించింది. జైలు మరమ్మత్తుల్లో భాగంగా అబు సలేంను మరో జైలుకు తరలించాలని జైలు అధికారులు భావించారు. అయితే దీనిపై అబు సలేం ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా నిన్న (మంగళవారం) విచారణ జరిపింది. తనకు ప్రాణభయం ఉందని, అందుకే మరో జైలుకు తనను తరలించవద్దని కోరారు. అబూ సలేంపై ఇప్పటికే రెండు సార్లు దాడులు జరిగినట్లు ఆయన తరఫు న్యాయవాదులు తారఖ్ సయ్యద్, అలిషా పారెఖ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యేక కోర్టు జడ్జీ బీడీ షెల్కే అబు సలేంను మరో జైలకు తరలించవద్దని జైలు అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.సలేం, అతని స్నేహితురాలు మోనికా బేడిలను సెప్టెంబర్ 20, 2002న ఇంటర్‌పోల్ అధికారులు లిస్బన్లో అరెస్ట్ చేశారు. 2004లో తమకు అప్పగించేందుకు ఇండియా అనుమతి పొందింది. సెప్టెబంర్ 11, 2005న ఇండియన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నాయ. 2005 నుంచి అబు సలేం తలోజా సెంట్రల్ జైలులోని ‘అండా సెల్’ లో ఉంటున్నారు.ప్రస్తుతం అబు సలేం ఉంటున్న తలోజా సెంట్రల్ జైల్లోని ‘అండా’ సెల్ చాలా భద్రతతో కూడినది. ఇలాంటి ‘అండా’ సెల్స్ కేవలం సెంట్రల్‌జైలులో మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి నవీ ముంబైలో ఉన్న తలోజా సెంట్రల్ జైలు. -
తేల్తుంబ్డే విడుదల
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే (73) ఎట్టకేలకు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. ఆయనకు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసిన నేపథ్యంలో ముంబైలోని తలోజ కేంద్ర కారాగారం నుంచి తుంబ్డే విడుదలయ్యారు. ఆయన రెండున్నళ్లుగా జైలులోనే గడిపారు. ఈ కేసులో 16 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. -
వరవరరావుకు ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన కవి, సామాజిక ఉద్యమకారుడు వరవరరావు(82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఈ నెల 28 దాకా తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలి్సన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ చేపడతామని వెల్లడించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న లొంగిపోవాల్సి ఉండగా, బెయిల్ గడువును పెంచాలని విజ్ఞప్తి చేస్తూ గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, బెయిల్ గడువును పెంచాలన్న వరవరరావు వినతిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వ్యతిరేకించింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరవరరావు ప్రస్తుతం ముంబైలో భార్యతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ గడువును పొడిగించాలన్న వరవరరావు విజ్ఞప్తి పట్ల న్యాయస్థానం గురువారం సానుకూలంగా స్పందించింది. ఈ నెల 28 దాకా లొంగిపోవాలి్సన అవసరం లేదని వెల్లడించింది. -
వరవర రావుకు బెయిల్
ముంబై/ సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుకి ముంబై హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. ఎల్గార్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2018 ఆగస్టు 28న వరవర రావుని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా వరవర రావుకు తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఆయన భార్య హేమలత వరవరరావు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. 82 ఏళ్ళ వరవరరావు వయసు, అతని తీవ్ర అనారోగ్య పరిస్థితి, తలోజా జైలులో ఆయనకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పైటేల్ల ధర్మాసనం బెయిల్ మంజూరుచేసింది. ‘ఉపశమనం ఇవ్వదగిన కేసు ఇది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వవచ్చు. తక్షణమే ఆయన్ను విడుదల చేయండి’అని కోర్టు ఆదేశించింది. హైకోర్టు జోక్యంతో గత ఏడాది నవంబర్‌లో వరవరరావుని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 1న వాదనలు ముగిశాక బెయిల్ అంశాన్ని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ప్రస్తుతం ముంబై నానావతీ ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. వరవరరావుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంపై మూడు వారాల పాటు స్టే విధించాలంటూ, ఎన్ఐఏ తరఫున వాదిస్తోన్న అడిషనల్ సోలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే, వరవరరావుకి బెయిలు మంజూరు చేస్తూ షరతులను కోర్టు విధించింది. వరవరరావు ఎన్ఐఏ కోర్టు పరిధిలో ముంబైలోనే ఉండాలని ఆదేశించింది. రూ.50వేల వ్యక్తిగత బాండు, అదే మొత్తానికి రెండు ష్యూరిటీలు సమర్పించాల్సిందిగా కోర్టు సూచించింది. తన సహనిందితులతోనూ, ఈ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారెవరితోనూ వరవరరావు సంబంధాలు నెరపరాదని కోర్టు చెప్పింది. వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫోన్లు చేయరాదని కోర్టు సూచించింది. 15రోజులకు ఒకసారి పోలీసులకు వరవరరావు వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలి. అన్ని కోర్టు విచారణలకు హాజరుకావాలని, కోర్టు సమన్లకు స్పందించాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో వరవరరావుని కలిసేందుకు సందర్శకులను అనుమతించబోమని, ఆయన పాస్‌పోర్టుని ఎన్ఐఏ కోర్టులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి మీడియా ఎదుట ప్రకటనలు చేయడాన్ని కోర్టు నిషేధించింది. వరవరరావుని కలిసేందుకు న్యాయవాదులకు, కార్యకర్తలకు అనుమతివ్వాలని వరవరరావు తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఆరునెలల వ్యవధి ముగిశాక ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరుకావాలని, లేదా బెయిలు పొడిగింపునకు హైకోర్టుకి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
వరవరరావు పరిస్థితి విషమం
ముంబై: ‘ఎల్గార్ పరిషత్’ కేసుకు సంబంధించి జైళ్లో ఉన్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవర రావును తక్షణమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జమ్‌దార్‌ల ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. దాంతో వరవర రావును ప్రత్యేక కేసుగా పరిగణించి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చి, 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో వరవరరావును చూసేందుకు ఆసుపత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావు నవీముంబైలోని తలోజా జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవర రావును తలోజా జైలు ఆసుపత్రి నుంచి తక్షణమే నానావతి ఆసుపత్రికి మార్చి, మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. వరవరరావు ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు మరణశయ్యపై ఉన్న ఒక 80 ఏళ్ల వ్యక్తికి తలోజా జైళ్లోనే చికిత్స అందిస్తామని ఎలా చెప్తారు?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రి అయిన నానావతి హాస్పిటల్లో వరవర రావు చికిత్సకు అయిన ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. చికిత్సకు అయ్యే ఖర్చును వరవర రావే భరించాలన్న ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే వాదనను.. వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర జైసింగ్ తోసిపుచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించలేకపోవడానికి డబ్బులు లేవన్న కారణాన్ని ప్రభుత్వాలు చూపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఉటంకించారు. ఆమె వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ‘ప్రస్తుతం ఆయన మీ కస్టడీలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మీ కస్టడీలో ఉన్నట్లుగానే భావించాలి. అందువల్ల చికిత్స ఖర్చును మీరే భరించాలి’ అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో, ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే రాష్ట్ర హోం మంత్రిని ఫోన్లో సంప్రదించారు. అనంతరం, వరవరరావుకు 15 రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కోర్టుకు తెలిపారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని, భవిష్యత్తులో ఈ తరహా కేసులకు దీన్ని ఉదాహరణగా చూపకూడదని అభ్యర్థించారు. ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను.. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దానికి, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగాలను నమోదు చేయాల్సి ఉందని ఎన్ఐఏ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ సమాధానమిచ్చారు. అభియోగాల నమోదుకు ఇంకా కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకంటే ఆ అభియోగాలన్నీ ప్రాథమికంగా కంప్యూటర్ సాక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయని వరవరరావు తరఫున జైసింగ్‌తో పాటు వాదనలు వినిపించిన ఆనంద్ గ్రోవర్ కోర్టుకు వివరించారు. చనిపోతే ఎవరిది బాధ్యత? విచారణ ఇలాగే కొనసాగితే వరవరరావు జైళ్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఇందిర జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు పారిపోకూడదనే ఉద్దేశంతోనే విచారణ ఖైదీలను జైళ్లో పెడతారని, కానీ, మానసికంగా దుర్బలమై, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వీవీ పారిపోయే అవకాశమే లేదని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన చనిపోతే ఎవరిది బాధ్యత? ఆసుపత్రిలో ఆయనకేమైనా అయితే, అది కస్టోడియల్ మరణమే అవుతుంది’ అని స్పష్టం చేశారు. జైళ్లో సహచరులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా వరవరరావును చూసుకుంటున్నారని, కానీ, వారు వైద్యంలో శిక్షణ పొందినవారు కాదని కోర్టుకు వివరించారు. ఆసుపత్రిలో ఉండగా, వరవరరావుకు చేసిన వైద్య పరీక్షలపై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అవి తప్పై ఉండొచ్చని, వాటిపై ఆయన వయసు 54 ఏళ్లు అని ఉందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్న లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. నానావతి హాస్పిటల్లో జరిపిన వైద్య పరీక్షల నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. కోర్టుకు తెలియజేయకుండా ఆయనను ఆసుపత్రి నుంచి పంపించేయవద్దని ఆదేశించింది. వీవీ భార్య హేమలత వేసిన రిట్ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఆయనను నానావతి ఆసుపత్రికి మార్చే అంశానికే బుధవారం నాటి వాదనలను పరిమితం చేద్దామని కోర్టు సూచించడంతో, బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగలేదు. విచారణను డిసెంబర్ 3కి కోర్టు వాయిదా వేసింది. -
వరవరరావుకు ఊరట
ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హైకోర్టు బుధవారం అనుమతించింది. దీంతో 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో వరవరరావుకు చికిత్స అందించనున్నారు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం వరవరరావును కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంది. కాగా ఎల్గార్ పరిషత్ కేసులో జైలులోఉన్న తెలుగు కవి వరవరరావు ఆరోగ్యంపై బొంబాయి హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వివరణ ఇచ్చింది. వరవరరావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని వివరించింది. అయితే, వరవరరావుకు న్యూరలాజికల్ సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యులున్నాయని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. దీంతో, అన్ని వైద్య పరీక్షలను నిర్వహించి, సమగ్ర వైద్య నివేదికను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరవరరావు ప్రస్తుతం తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. చదవండి: వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ -
వరవరరావుకి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు నిర్వహించాలి
ముంబై: బీమా కోరెగావ్ కేసులో తలోజా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విప్లవకవి వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వైద్య పరీక్షల నివేదికను నవంబర్ 16 లోపు కోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడి ఆరోగ్య పరిరక్షణకు నానావతి ఆసుపత్రి వైద్యుల పరీక్షలే ఉపయోగకరమని కోర్టు అభిప్రా యపడింది. వరవరరావు బెయిలు విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. వరవరరావు భార్య హేమలత, తన భర్తని మెరుగైన చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి మార్చాలని, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్వతంత్ర వైద్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని, వరవరరావుకు ఉన్న ఆరోగ్య సమస్యలరీత్యా ఆయన్ను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, అతను జైలులోనే చనిపోయే ప్రమాదం ఉన్నదని వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర వ్యాఖ్యానించారు. -
విషమంగా వరవరరావు ఆరోగ్య పరిస్థితి
-
వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు మహారాష్ట్రలోని తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితం కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.