వరవర రావుకు బెయిల్‌

Bombay High Court Grants Varavara Rao Bail For 6 Months - Sakshi

తక్షణం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయండి

ముంబై హైకోర్టు ఆదేశం   

ముంబై/ సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుకి ముంబై హైకోర్టు ఆరు నెలల బెయిల్‌ మంజూరు చేసింది. ఎల్గార్‌ పరిషద్, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2018 ఆగస్టు 28న వరవర రావుని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా వరవర రావుకు తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఆయన భార్య హేమలత వరవరరావు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. 82 ఏళ్ళ వరవరరావు వయసు, అతని తీవ్ర అనారోగ్య పరిస్థితి, తలోజా జైలులో ఆయనకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్‌ షిండే, జస్టిస్‌ మనీష్‌ పైటేల్‌ల ధర్మాసనం బెయిల్‌ మంజూరుచేసింది. ‘ఉపశమనం ఇవ్వదగిన కేసు ఇది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్‌ ఇవ్వవచ్చు. తక్షణమే ఆయన్ను విడుదల చేయండి’అని కోర్టు ఆదేశించింది.

హైకోర్టు జోక్యంతో గత ఏడాది నవంబర్‌లో వరవరరావుని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 1న వాదనలు ముగిశాక బెయిల్‌ అంశాన్ని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ప్రస్తుతం ముంబై నానావతీ ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోంది. వరవరరావుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయడంపై మూడు వారాల పాటు స్టే విధించాలంటూ, ఎన్‌ఐఏ తరఫున వాదిస్తోన్న అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే, వరవరరావుకి బెయిలు మంజూరు చేస్తూ షరతులను కోర్టు విధించింది. వరవరరావు ఎన్‌ఐఏ కోర్టు పరిధిలో ముంబైలోనే ఉండాలని ఆదేశించింది.

రూ.50వేల వ్యక్తిగత బాండు, అదే మొత్తానికి రెండు ష్యూరిటీలు సమర్పించాల్సిందిగా కోర్టు సూచించింది. తన సహనిందితులతోనూ, ఈ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారెవరితోనూ వరవరరావు సంబంధాలు నెరపరాదని కోర్టు చెప్పింది. వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫోన్లు చేయరాదని కోర్టు సూచించింది. 15రోజులకు ఒకసారి పోలీసులకు వరవరరావు వాట్సాప్‌ వీడియో కాల్స్‌ చేయాలి. అన్ని కోర్టు విచారణలకు హాజరుకావాలని, కోర్టు సమన్లకు స్పందించాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో వరవరరావుని కలిసేందుకు సందర్శకులను అనుమతించబోమని, ఆయన పాస్‌పోర్టుని ఎన్‌ఐఏ కోర్టులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి మీడియా ఎదుట ప్రకటనలు చేయడాన్ని కోర్టు నిషేధించింది. వరవరరావుని కలిసేందుకు న్యాయవాదులకు, కార్యకర్తలకు అనుమతివ్వాలని వరవరరావు తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఆరునెలల వ్యవధి ముగిశాక ఎన్‌ఐఏ కోర్టు ఎదుట హాజరుకావాలని, లేదా బెయిలు పొడిగింపునకు హైకోర్టుకి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top