
మంజూరు చేసిన సుప్రీంకోర్టు ∙టీడీపీ అంతర్గత కుమ్ములాటలతో జంట హత్యలు
హతులు.. నిందితులందరూ టీడీపీ వారే
అయినా పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేర్చిన పోలీసులు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా చోటు చేసుకున్న ఆ పార్టీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్యకు సంబంధించి రాజకీయ దురుద్దేశాలతో నమోదు చేసిన కేసులో వైఎస్సార్‌సీపీ నేతలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
వారిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని పిన్నెల్లి సోదరులను ఆదేశించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాజకీయ కక్షతో పిన్నెల్లి సోదరులపై కేసు
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, జవిశెట్టి కోటేశ్వరరావు ఈ ఏడాది మే 24న హత్యకు గురయ్యారు. వివాహానికి వెళ్లి బైకుపై తిరిగి వస్తుండగా బోదిలవీడు సమీపంలో టీడీపీకే చెందిన తోట వెంకట్రామయ్య తదితరులు స్కార్పియో వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారు.
తోట వెంకట్రామయ్యకు, మృతుడు జవిశెట్టి వెంకటేశ్వర్లుకు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. అయితే పోలీసులు యధావిధిగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల దాన్ని కొట్టేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
అంతర్గత పోరులో భాగమే ఈ హత్య అని ఎస్పీనే చెప్పారు..
ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిన్నెల్లి సోదరుల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, షోయబ్ ఆలం, సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో నమోదు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే ఫిర్యాదుదారు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారని, నిజానికి అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా చెప్పారని, ఆ తర్వాత రాజకీయ జోక్యంతో పిటిషనర్లను నిందితులుగా చేర్చారని వివరించారు. జవిశెట్టి సోదరుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని తెలిపారు.
వీరు మినహా నిందితులంతా టీడీపీ వారేగా..
ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇది హత్య కేసని, ఎలాంటి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, హత్య కేసన్న సంగతి తమకు తెలుసని చెప్పింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... పిటిషనర్లు మినహా మిగిలిన నిందితులందరూ కూడా హత్యకు గురైన వారి పార్టీ (టీడీపీ)కి చెందిన వారేనంటూ వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది ఏదో చెప్పబోతుండగా, ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, కౌంటర్ దాఖలు చేయనివ్వండి.. అన్నీ పరిశీలించి అవసరమైతే ముందస్తు బెయిల్ రద్దు చేస్తాం అని తేల్చి చెప్పింది.
ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఇదే సమయంలో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ట్రయల్ ముగియకుండా పిటిషనర్లు జాప్యం చేస్తుంటే, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తామిచ్చిన ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ ప్రభుత్వం తమను కోరవచ్చని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.