
బెంగళూరు: అమ్మాయిలను సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ పోకిరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
వివరాల ప్రకారం.. గురుదీప్ సింగ్ (26) అనే వ్యక్తి బెంగళూరులోని చర్చి స్ట్రీట్, కోరమంగళ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఈ సమయంలో రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. అనంతరం, వాటిని ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నాడు. అయితే, ఓ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా షాకైంది. ఈ వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ రావడంతో ఆవేదన చెందింది. అనంతరం, తన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని సదరు యువతి.. గురుదీప్ సింగ్‌కు మెసేజ్ పెట్టింది. ఈ క్రమంలో నిందితుడు.. దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోగా.. అసభ్య పదజాలంతో ఆమెను దూషించాడు.
దీంతో, గురుప్రీత్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సహాయం కోసం @blrcitypolice, @cybercrimecid పోలీసులకు ఈ పోస్టులను ట్యాగ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుప్రీత్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు స్పందిస్తూ.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా బెంగళూరులో తిరుగుతున్నారన చెప్పుకొచ్చింది. వారిపై కూడా చర్చలు తీసుకోవాలని పోలీసులను కోరింది.