బైరతి బసవరాజుకు ఆస్పత్రిలో చికిత్స చేయించండి
బనశంకరి: రౌడీషీటర్ బిక్లు శివ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ గురువారం అరైస్టెన మాజీమంత్రి, కేఆర్‌పుర బీజేపీ ఎమ్మెల్యే బైరతిబసవరాజ్‌ను సీఐడీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన ఆయన్ను తొలుత బౌరింగ్ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి సీఐడీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం నగరంలోని 42వ జేసీఎంఎం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాలని కోరారు. బైరతి బవసరాజ్‌కు గుండె సంబంధిత వ్యాధి ఉందని, ఆయనకు చికిత్స అవసరమని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స అందించి శనివారం కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. బిక్లు శివ హత్యకేసులో ఏ 20 ఆరోపిగా ఉన్న మలయాళిఅజిత్ బెయిల్‌ను గురువారం కోర్టు రద్దుచేయడంతో అతన్ని సీఐడీ అరెస్ట్ చేసింది.
చిరుతపులి దాడిలో జూపార్కు ఉద్యోగికి గాయాలు
బొమ్మనహళ్లి: చిరుతపులిదాడిలో జూ కీపర్ గాయపడిన ఘటన బన్నేరుఘట్ట బన్నేరుఘట్ట్ట పార్క్ పునరావాస కేంద్రంలో జరిగింది. శాంతప్ప అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టు విధానంలో జూ కీపర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం చిరుతపులి ఉన్న బోనును శుభ్రం చేస్తుండగా చిరుతపులి ఇనుప మెష్ ద్వారా ముందు కాళ్లను బయటకు పెట్టి దాడి చేసింది. దీంతో చెంప, మెడపై కాలిగోళ్లు గుచ్చుకొని శాంతప్పకు బలమైన గాయాలయ్యాయి. సిబ్బంది గమనించి శాంతప్పను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ పాఠశాలలను మూసేయొద్దు
చిక్కబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం కేపీఎస్ మ్యాగ్నట్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో 40 వేల ప్రభుత్వ పాఠశాలలు, చిక్కబళ్లాపురం జిల్లాలో 1300 ప్రభుత్వ పాఠశాలలను మూసేయడానికి సిద్ధమవుతోందని ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కోశాధికారి సుభాష్ బెట్టదకొప్ప అన్నారు. ఆయన మరళుకుంటె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దల సమక్షంలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. ప్రతి జీపీలో ఒక పాఠశాల ఏర్పాటుకు సర్కార్ సిద్ధమవుతోంది. 1, 2వ తరగతి పిల్లలు 5 నుంచి 6 కిమీ దూరం నడుచుకొని వెళ్లి రావడం కష్టతరం. సరైన బస్ వ్యవస్థ లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం కొద్ది మంది మన ఊరిలోనే మన పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో పాఠశాలకు స్థలాన్ని అందించారు. ఇలా పాఠశాలను మూసేయడం ద్వారా అనేక మంది పిల్లలు బడి మానేస్తారని అన్నారు. అందువల్ల ప్రభుత్వం కేపీఎస్ మ్యాగ్నట్ పథకాన్ని వదులుకోవాలి లేదా ఉన్న పాఠశాలలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు.


