
లేదంటే చిన్న వ్యాపారులు మళ్లీ నగదు వైపు మళ్లొచ్చు
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్రూ్కటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్‌టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్‌టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.
యూపీఐ చెల్లింపుల ఆధారంగా జీఎస్‌టీ నోటీసులు వస్తుండటంతో, కర్ణాటకలోని చిన్న వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
పరోక్ష పన్నుల విధానం వల్ల జవాబుదారీతనం, ఆదాయం మరింతగా పెరిగినప్పటికీ, చిన్న ట్రేడర్లపై జరిమానాలు వేయకుండా, వారికి సాధికారత కల్పించినప్పుడే దీర్ఘకాలంలో ఇది విజయవంతం అవుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తెలిపింది. యూపీఐలాంటి డిజిటల్ లావాదేవీల ఆధారంగా బెంగళూరులోని పలువురు చిన్న ట్రేడర్లు, దుకాణదారులకు అసంబద్ధ స్థాయిలో ట్యాక్స్ నోటీసులు రావడాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశంపై కర్ణాటకలోని చిన్న వ్యాపారులు జూలై 23 నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను తలపెట్టారు.
టాప్ 5 రాష్ట్రాల వాటా 50 శాతం..
జీఎస్‌టీ అమలు, మొత్తం చెల్లింపుదారుల్లో టాప్ 5 రాష్ట్రాల వాటా సుమారు 50 శాతంగా ఉంటోందని నివేదిక పేర్కొంది. చెల్లింపుదారుల్లో మహిళల వాటా (ప్రతి అయిదుగురిలో ఒకరు) పెరుగుతోందని వివరించింది. ప్రస్తుతం 1.52 కోట్ల పైగా గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పెద్దవి, సంపన్నమైనవి అయినప్పటికీ, మొత్తం జీఎస్‌డీపీలో ఆయా రాష్ట్రాల వాటాతో పోలిస్తే క్రియాశీలక జీఎస్‌టీ ట్యాక్స్‌పేయర్ల వాటా తక్కువగానే ఉంటోంది. అదే సమయంలో మొత్తం జీఎస్‌డీపీలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, గుజరాత్‌ల వాటా తక్కువే అయినప్పటికీ మొత్తం జీఎస్‌టీ ట్యాక్స్‌పేయర్లలో ఆయా రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటోంది.