గోధుమల ఎగుమతులపై నిషేధం

Government prohibits wheat exports - Sakshi

ధరల్ని కట్టడి చేయడానికేనన్న కేంద్రం

ఇది పక్కా రైతు వ్యతిరేక చర్యే

కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది. ఎగుమతులపై నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) శుక్రవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది.

అయితే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఆధారంగా మే 13 వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గోధుమల ఎగుమతికి అనుమతినిస్తామని పేర్కొంది. అంతే కాదు ఆహార కొరతనెదుర్కొంటున్న ఇరుగు పొరుగు దేశాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దేశాలకు గోధుమల ఎగుమతి జరుగుతుందని స్పష్టం చేసింది. గోధుమ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయికి చేరుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల గోధుమల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతుల్లో 50శాతం బంగ్లాదేశ్‌కే వెళ్లాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చాలా దేశాలు గోధుమల కోసం భారత్‌పైనే ఆధారపడ్డాయి.

దీంతో రైతుల దగ్గర నుంచి మంచి ధరకు గోధుమల్ని కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి. ఈ సమయంలో గోధుమల ఎగుమతులపై నిషేధాన్ని విధించడమంటే రైతు వ్యతిరేక విధానమని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. అంతర్జాతీయంగా గోధుమలకు గిరాకీ పెరగడంతో రైతులకు మంచి ధర వస్తూ ఉంటే వాటిని ఆపేసిందంటూ కాంగ్రెస్‌ నాయకుడు చిదంబరం మండిపడ్డారు. మరోవైపు భారత్‌ కృషిక్‌ సమాజ్‌ (బీకేఎస్‌) కూడా గోధుమల ఎగుమతుల నిలిపివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం అంటే అది పరోక్షంగా రైతులపై    పన్ను విధించడమేనని ఆ సంస్థ చైర్మన్‌ అజయ్‌    విర్‌ జాఖడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం గోధుమల నిషేధం చర్యల్ని సమర్థించుకుంది. గోధుమ ధరలు 40% పెరిగిపోవడంతో    ధరల్ని కట్టడి చేయడానికే ఎగుమతుల్ని నిలిపివేశామని చెబుతోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top