26 ఏళ్ల తరువాత న్యాయం: విధి చేసిన గాయం.. భక్తుడు చేసిన సాయం!

Gopal became beggar without Getting Retired Benefits in Madurai - Sakshi

పాతికేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినా.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ ఇచ్చేందుకు(లోన్‌ ఉందనే కారణంతో) ఉన్నతాధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో కుమారుడి మరణం అతడిని కుంగదీసింది. తన కళ్లెదుటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెలు రోజు కూలీలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై పాతికేళ్లుగా జీవచ్ఛవం అయ్యాడు. అయితే ఓ గుడి దగ్గర యాచించే సమయంలో అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడుతుండడంతో ఓ భక్తుడు గుర్తించారు. ఇతని దీనస్థితిని తెలుసుకుని మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఎట్టకేలకూ 26 ఏళ్ల తరువాత న్యాయం దక్కింది. 

సాక్షి, చెన్నై: పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు. చివరికి ఆ అభాగ్యుడిపై కోర్టు కరుణ చూపించింది. ఆరు వారాల్లోపు ఆయనకు చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేయాలని మదురై ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వివరాలు.. మదురై శివారుల్లోని ఆల యాల వద్ద  గత కొన్నేళ్లుగా ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఆయన అనర్గళంగా ఆంగ్లం, తమిళ భాషాలను మాట్లాడటం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలను వల్లిస్తుండడంతో ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఇటీవల ఆయన వివరాలను ఆరా తీశాడు. అతడి దీనగాథ∙విన్న ఆ భక్తుడు తన మిత్రుడైన న్యాయవాది జిన్నాకు సమాచారం ఇచ్చాడు.  

చదవండి: (Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్‌)

భిక్షగాడిగా.. 
విచారణలో తంజావూరు జిల్లా తిరుచ్చిట్రంబలంకు చెందిన రిటైర్డ్‌ అసిస్టెంట్‌ వ్యవసాయ అధికారి గోపాల్‌గా గుర్తించారు. 1996లో ఈయన పదవీ విరమణ చేసిన సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలం దక్కలేదు. ఇందుకు కారణం ఆయన సహకార బ్యాంక్‌లో రుణం తీసుకుని ఉండడమే. అదే సమయంలో మధ్యలో చదువు ఆపేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గోపాల్‌ మానసికంగా కుంగిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి కూడా చేయలేని పరిస్థితిలో పడ్డాడు. ఆ ఇద్దరు  కూలి పనులకు వెళ్తుండడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.  

భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండడం వెలుగు చూసింది. దీంతో ఆయనకు రావాలసిన పదవీ విరమణ మొత్తం కోసం న్యాయవాది జిన్నా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి జీఆర్‌ స్వామినాథన్‌ బెంచ్‌ మందుకు శుక్రవారం  విచారణకు వచ్చింది. 74 ఏళ్ల వయస్సులో గోపాల్‌ పడుతున్న వేదనపై కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సహకారం సంఘంలో ఆయన తీసుకున్న అప్పు ప్రస్తుతం వడ్డీతో రూ. 5.37 లక్షలకు చేరినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు రావాల్సిన నగదును రుణానికి జయచేయాలని, మిగిలిన సొమ్ముకు వడ్డీ లెక్కించి గోపాల్‌కు ఆరు వారాలలోపు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top