GATE 2022: గేట్‌.. గెలుపు బాట!

GATE 2022: Preparation Guidance, Exam Pattern, Eligibility, Important Dates - Sakshi

గేట్‌–2022 తేదీల ఖరారు

2021 ఆగస్ట్‌ 30 నుంచి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రారంభం

ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో పరీక్షలు

గేట్‌లో మొత్తం సబ్జెక్ట్‌ పేపర్ల సంఖ్య: 29

ఇప్పట్నుంచి కృషి చేస్తే విజయం సులభమే

గేట్‌.. గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌! ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో.. ప్రవేశానికి తొలి మెట్టు! అంతేకాదు గేట్‌ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో.. కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే.. ప్రతి ఏటా గేట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తాజాగా గేట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల(ఆగస్టు) 30న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. గేట్‌–2022లో మార్పులు.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం..

గేట్‌–2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి..నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌; జియోమాటిక్స్‌ ఇంజనీరింగ్‌. దీంతో గేట్‌లో మొత్తం సబ్జెక్ట్‌ పేపర్ల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరు విధానాన్ని గేట్‌–2021 నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చారు. అనుమతించిన(రెండు పేపర్ల కాంబినేషన్‌) జాబి తా నుంచి అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.

అర్హత
ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/కామర్స్‌ /సైన్స్‌/ఆర్ట్స్‌ విభాగాల్లో.. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులే. దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. 

ఆన్‌లైన్‌ పరీక్ష
► గేట్‌ పరీక్ష ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. 

► మొత్తం 65 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

► రెండు విభాగాలుగా జరిగే గేట్‌లో.. పార్ట్‌–ఏ జనరల్‌ అప్టిట్యూడ్‌. ఈ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. 

► పార్ట్‌–బీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. ఈ విభాగంలో మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలు ఒక మార్కు, 30 ప్రశ్నలు రెండు మార్కులకు ఉంటాయి. 

► పార్ట్‌–బీలోనే ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ నుంచి 10–15 మార్కులకు ప్రశ్నలుంటాయి.


ప్రశ్నలు.. మూడు రకాలు

► గేట్‌ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలను అడుగుతారు. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌(ఎంసీక్యూలు)గా పేర్కొనే ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు. రెండో రకం ప్రశ్నలు.. మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌(ఎంఎస్‌క్యూ). మూడో విధానంలో న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌(ఎన్‌ఏటీ) ప్రశ్నలు. 

► ఎంసీక్యూ ప్రశ్నల విధానంలో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది.

► మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. అభ్యర్థులకు సంబంధిత అంశంపై సమగ్ర అవగాహన ఉండాలి. 

► న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి. వీటికి వర్చువల్‌ కీ ప్యాడ్‌ ద్వారా సమాధానం టైప్‌ చేయాల్సి ఉంటుంది. 


సిలబస్‌ విశ్లేషణ

ముందుగా అభ్యర్థులు గేట్‌ పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అందుకోసం తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి సిలబస్‌ను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. గత ప్రశ్న పత్రాల్లో ఆయా టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. ఆ తర్వాత గేట్‌ సిలబస్‌ను అకడమిక్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. దానికి అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ వ్యూహాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించడం మేలు అంటున్నారు నిపుణలు. 

వెయిటేజీని అనుసరిస్తూ
గేట్‌–2022 పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులకు ఆరు నెలలకు పైగా సమయం అందుబాటులో ఉంది. సీరియస్‌ అభ్యర్థులకు విజయ సాధన దిశగా ఈ సమయం సరిపోతుందనే చెప్పొచ్చు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన వ్యూహాలను అనుసరించాలి. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌లలో తమ బలాలు, బలహీనతలపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. గత అయిదారేళ్లుగా గేట్‌లో లభిస్తున్న వెయిటేజీ, అకడమిక్‌ వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్‌ పూర్తి చేసుకునేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి.

బేసిక్స్, అప్లికేషన్‌ అప్రోచ్‌
గేట్‌లో మంచి స్కోర్‌ సాధించి ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌పై గట్టి పట్టు సాధించాలి. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులో ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించాలి. వాటికి సంబం«ధించి ప్రాథమిక భావనలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒక టాపిక్‌ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అంచనావేయాలి. ఆ మేరకు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. దాంతోపాటు వీక్లీ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. 


సమయ పాలన

గేట్‌ విజయంలో సమయ పాలన ఎంతో ముఖ్యం. ప్రస్తుత సమయంలో విద్యార్థులు రోజుకు కనీసం ఐదారు గంటలు గేట్‌ ప్రిపరేషన్‌కు కేటాయించేలా ప్లాన్‌ చేసుకోవాలి.వాస్తవానికి ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు.. ఇది కొంత కష్టమైన విషయమే. అయినా సమయం కేటాయించే ప్రయత్నం చేయాలి. గేట్‌ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌ పరీక్ష తీరుపై అవగాహన పెంచుకోవాలి. వర్చువల్‌ కాలిక్యులేటర్‌ వినియోగం, ఆన్‌స్క్రీన్‌ ఆన్సర్స్‌ రికగ్నిషన్‌ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం వీలైతే ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష పాత ప్రశ్న పత్రాల సాధన కూడా గేట్‌లో విజయానికి దోహదపడుతుంది. 

అకడమిక్స్‌ ఆలంబనగా
గేట్‌ విద్యార్థులు అకడమిక్‌ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ముందడుగేయాలి. ఎందుకంటే.. గేట్‌ గత ప్రశ్నలు, పరీక్ష తీరుతెన్నులను పరిశీలిస్తే.. అకడమిక్‌ పుస్తకాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంటర్‌ రిలేటెడ్‌ టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు.. దానికి సంబంధించి పూర్వాపరాలు ఉన్న పుస్తకాలను అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ప్రతి అంశానికి సంబంధించి.. మూల భావనలు, కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. 

మలి దశలో ఇలా
గేట్‌ స్కోర్‌ అనేది.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి తొలి మెట్టు మాత్రమే. తర్వాత దశలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ ప్రక్రియలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆయా ఐఐటీలు పర్సనల్‌ టాస్క్, గ్రూప్‌ డిస్కషన్స్‌ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు.. ఎస్సే రైటింగ్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే అడ్మిషన్‌ ఖరారవుతోంది.

పీఎస్‌యూలు.. మలిదశ
గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంట్రీ లెవల్‌ నియామకాలను చేపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు).. మలి దశలో రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్స్‌ వంటివి నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్‌ స్కోర్‌కు 70 శాతం, మలి దశ ఎంపిక ప్రక్రియకు 30 శాతం వెయిటేజీ లభిస్తోంది. 

స్కోర్‌ సాధిస్తేనే
గేట్‌లో విజయం ద్వారా ఐఐటీల్లో సీట్లు, పీఎస్‌యూ కాల్స్‌ ఆశించే అభ్యర్థులు... గేట్‌లో కనీసం 650కు పైగా స్కోర్‌ సాధించేందుకు కృషి చేయాలి.  పలు ఇన్‌స్టిట్యూట్‌లు కనీస కటాఫ్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో కోర్‌ బ్రాంచ్‌లలో ఫైనల్‌ కటాఫ్‌ 800 వరకు ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్‌ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు.. ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి.

గేట్‌–2022 సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్‌ 30, 2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 24, 2021
► గేట్‌ పేపర్‌ మార్పు, కేటగిరీ, పరీక్ష కేంద్రం మార్పునకు చివరి తేది: నవంబర్‌ 12, 2021
► గేట్‌–2022 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో రోజుకు రెండు స్లాట్లలో పరీక్ష ఉంటుంది. 
► గేట్‌ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్‌.
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://gate.iitkgp.ac.in/index.html

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top