
శ్రీనగర్: దేశ రాజ్యాంగం ప్రజలందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను ఇచి్చందని, అది ఉగ్రవాదాన్ని కీర్తించడం కోసం కాదని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో 40 ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, న్యాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ప్రతి బాధిత కుటుంబానికి పునరావాసం కల్పించే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రాజకీయ అవకాశాల కోసం ఎవరైనా ఉగ్రవాదాన్ని కీర్తిస్తే.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ ఇప్పటికే చాలా ఎంతో రక్తపాతాన్ని చూసిందని, ఇప్పుడా బాధలకు, కన్నీళ్లకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు.