యూపీ నిర్భయ పట్ల అమానవీయం

Forcible Cremation Symbolic of Caste Violence and Lawlessness in UP - Sakshi

అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు పూర్తి

యూపీ ప్రభుత్వంపై పార్టీలు, హక్కుల సంఘాల ఆగ్రహం

యూపీ సీఎంకు ప్రధాని ఫోన్‌

సిట్‌ ఏర్పాటు చేసిన సీఎం యోగి

హథ్రాస్‌/లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ‘నిర్భయ’ ఘటన బాధితురాలి పట్ల అధికార యంత్రాంగం మరోసారి అమానవీయంగా వ్యవహరించింది. ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన ఆ దళిత యువతి(19)కి అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించింది. అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ పోలీసులు తమను బలవంతపెట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. తాజా  పరిణామంపై రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి.

కుటుంబసభ్యుల అనుమతి లేకుండా హడావుడిగా అంత్యక్రియలు ముగించడంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. కుటుంబసభ్యుల కోరిక మేరకే అంత్యక్రియలు జరిపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం(సిట్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. వారంలోగా దర్యాప్తు పూర్తి చేయించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎంకు ఫోన్‌ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సీఎం యోగి బుధవారం ఉదయం బాధితురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. అర్థరాత్రి జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హథ్రాస్‌ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన దళిత యువతిపై 15 రోజుల క్రితం అగ్ర వర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, పాశవికంగా వ్యవహరించారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రిలో చనిపోయింది. రాత్రి సమయంలో ఆస్పత్రి నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు వెంటరాగా బాధితురాలి మృతదేహాన్ని తీసుకుని కుటుంబసభ్యులు అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న హథ్రాస్‌ జిల్లాలోని సొంతూరుకు చేరుకున్నారు. అప్పటికి అర్ధరాత్రి 2.30 గంటలైంది. అధికారులు, పోలీసుల సమక్షంలో అప్పటికప్పుడే దహన సంస్కారాలు జరిపించారు.

ఆ సమయంలో మృతురాలి తండ్రితోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిపి సుమారు 40 మంది శ్మశానవాటికలో ఉన్నారని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. మీడియా సభ్యులు దరిదాపుల్లోకి రాకుండా ప్రత్యేక పోలీసు దళాన్ని కూడా రంగంలోకి దించారు. ‘నా కూతురికి అర్థరాత్రి దాటిన తర్వాత 2.30–3 గంటల సమయంలో అంత్యక్రియలు జరిగాయి’ అని ఆమె తండ్రి తెలిపారు. ‘మా నాన్న ఢిల్లీ ఆస్పత్రి నుంచి హథ్రాస్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు మా ఇంటికి వచ్చారు. మా నాన్నను బలవంతంగా తమతోపాటు శ్మశానవాటికకు తీసుకెళ్లారు’ అని బాధితురాలి సోదరుడు తెలిపారు. తాము గ్రామానికి చేరుకోకమునుపే పోలీసులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారని ఓ కుటుంబసభ్యుడు ఆరోపించారు.

తీవ్ర విమర్శలు
హత్యాచారానికి దారి తీసిన పరిస్థితులు, అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు జరిపించడంపై వివిధ ప్రతిపక్షపార్టీలు, వామపక్షాలు, కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ వైఖరిపై ఢిల్లీలోని యూపీ భవన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తెలిపారు. తన కూతురికి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు.

‘బాధితురాలికి, ఆమె కుటుంబానికి మీ ప్రభుత్వం భద్రత కల్పించలేక పోయింది. మరణంతో సహా ఆమెకున్న అన్ని హక్కులను హరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగడానికి మీకు ఎలాంటి నైతిక హక్కు లేదు. రాజీనామా చేయండి’ అంటూ ప్రియాంక ట్విట్టర్‌లో సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి తీవ్రంగా తప్పుపట్టారు.  ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. సాక్ష్యాలను చెరిపేసేందుకు పోలీసులు అర్థరాత్రి అంత్యక్రియలు జరిపారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌యాదవ్‌ ఆరోపించారు.

కోల్‌కతాలో యూపీ సీఎం కటౌట్‌ దహనం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top