ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం 

Five Terrorists Gunned Down in Shopian - Sakshi

కశ్మీర్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లు 

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ వరస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోంది. సొఫియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల శ్రీనగర్, బందిపొరా కాల్పులతో ప్రమేయమున్న ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్లో మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. ‘సొఫియాన్, తుల్రాన్, ఫీరిపొరా గ్రామాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని 24 గంటల్లో అందిన ప్రాథమిక సమాచారం మేరకు వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఉగ్రవాదులు పోలీసు బృందాలపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు.

శ్రీనగర్‌లోని లాల్‌బజార్‌లో స్థానికేతరుడిని చంపేసిన ఉగ్రవాది ముక్తార్‌ షా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు’అని కశ్మీర్‌ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఒక ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మరణిస్తే, మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదులందరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారే. వీరంతా ఇటీవల కాలంలో పౌరులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతూ కశ్మీర్‌లోయలో బీభత్సం సృష్టించినట్టు ఆ అధికారి వివరించారు.  

చదవండి: (ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం?)

పాక్‌ జాతీయుడు అరెస్ట్‌ 
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో లింకులున్నట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్‌ జాతీయుడ్ని ఢిల్లీ పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలో దాడులకు కుట్ర పన్నిన అతనిని లక్ష్మీ నగర్‌లో అదుపులోనికి తీసుకొని, ఏకే 47 గన్స్, ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కి చెందిన మొహమ్మద్‌ అష్రాఫ్‌ అలియాస్‌ అలీ(40) బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌లోకి చొరబడ్డాడు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడని అధికారులు తెలిపారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top