జాలర్ల ఫైట్‌.. గాల్లో కాల్పులు 

Fishermen Groups Clash Puducherry Beach Police Fire Warning Shots - Sakshi

 పుదుచ్చేరిలో ఉద్రిక్తత 

సాక్షి, చెన్నై: నిషేధిత వలల విషయంపై రెండు గ్రామాల జాలర్ల మధ్య శనివారం పుదుచ్చేరిలో వివాదం భగ్గుమంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు రౌండ్లు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. రాష్ట్రంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జాలర్లు వినియోగించే కొన్ని రకాల వలలపై ప్రభుత్వం నిషేధించింది. అలాగే పడవల కు కొన్ని రకాల ఇంజిన్లు వాడకానికి కూడా అనుమతులు రద్దు చేసి ఉంది.  అయితే, ఓ వర్గం ఈ నిషేధానికి అనుకూలంగా, మరో వర్గం వ్యతిరేకం అన్నట్టుగా జాలర్లు  విడిపోయారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య నిరసనలు, వివాదాలు తరచూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పుదచ్చేరిలో శనివారం రెండు గ్రామాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 

చదవండి: ఆ తల్లి నిర్దోషి, ఇవన్ని ఆకాశరామన్న ఉత్తరాలే?!

గాల్లోకి కాల్పులు.. 
వీరాపట్నం, నల్లవాడు గ్రామానికి చెందిన జాలర్ల మధ్య ఈ వలల విషయంలో వివాదం రగులుతూ వస్తోంది. శనివారం వీరాపట్నం జాలర్లు నల్లవాడు సరిహద్దుల్లో 30కి పైగా పడవల్లో నిషేధిత వలల్ని ఉపయోగించి చేపల వేటలో నిమగ్నం అయ్యారు. వీరిని అడ్డుకునేందుకు వీరాపట్నం గ్రామ జాలర్లు ఏకం కావడం, ఈటెలు, కర్రల సాయంతో సముద్రంలోకి  వెళ్లారు. ఈ సమాచారంతో నల్లవాడు గ్రామం నుంచి పెద్దఎత్తున జాలర్లు తరలిరావడంతో పరస్పరం దాడులకు సిద్ధం అయ్యారు. రెండు గ్రామాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పలు మార్లు గాల్లో కాల్పులు జరిపి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సముద్రంలో చేపల వేటలో ఉన్న జాలర్ల మీద సైతం డమ్మి బుల్లెట్లను ఉపయోగించి తరిమి కొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈనేపథ్యంలో రెండు గ్రామాల మధ్య మళ్లీ ఉద్రిక్తత నెలకొనకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అరియాకుప్పం ఎమ్మెల్యే భాస్కరన్‌ నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగి,రెండు గ్రామాల జాలర్లతో చర్చిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top