
సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో తాను గడిపిన జీవితాన్ని వివరిస్తూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నవ్వులు పూయించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని చెప్పారు. ఇటీవల జరిగిన ఓ సభలో ఆయన తన లాక్‌డౌన్ జీవితాన్ని వివరించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలతో పాటు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.
ఇతరులతో చేతులు కలపడానికి.. ఆలింగనం చేసుకోవడానికి భయపడ్డామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. నిజాయతీగా చెబుతున్నాననంటూ ఆ భయంతోనే తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచారు. ఏమో ఏమైనా జరగొచ్చనే భయంతో మనసెంత కోరుకున్నా సరే తాను నియంత్రణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలని ఆకాంక్షిస్తూనే కోవిడ్ టీకా రావడంపై మాజీ సీఎం హర్షం వ్యక్తం చేశారు.