IES Examination: చదువంటే ఇష్టం; ఆ ఇష్టమే ఈరోజు

Farmers Son Secures 2nd Rank In Indian Econonmic Services Jammu Kashmir - Sakshi

కశ్మీర్‌: తన చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు జమ్మూ కశ్మీర్‌కు చెందిన తన్వీర్‌ అహ్మద్‌ఖాన్‌. తాజాగా విడుదలైన ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీస్‌(ఐఈఎస్‌) పరీక్షలో రెండో ర్యాంకు సాధించాడు. తన్వీర్‌ తండ్రి వ్యవసాయం చేసుకుంటూనే రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు. అహ్మద్‌ ఖాన్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లోనే కొన‌సాగింది. అనంత్ నాగ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి 2016లో బీఏ ఉత్తీర్ణత సాధించాడు.

మొద‌టి నుంచి అత్యంత ప్రతిభావంతుడైన ఖాన్‌.. క‌శ్మీర్ యూనివ‌ర్సిటీలో ఎంఏ ఎకాన‌మిక్స్‌లో ప్రవేశం పొందాడు. గ‌తేడాది జేఆర్ఎఫ్ సాధించాడు. కోల్‌క‌తాలో ఎంఫిల్ పూర్తి చేశాడు. ఎంఫీల్ ప‌ట్టాను 2021, ఏప్రిల్‌లో పొందాడు. ఇక కోవిడ్ స‌మ‌యంలో ఎంఫిల్ చేస్తూనే.. ఐఈఎస్ కోసం క‌ఠినంగా చ‌దివాడు. ప్రణాళికబద్ధంగా చదవడంతో మొదటి ప్రయత్నంలోనే ఐఈఎస్‌ పరీక్షలో రెండో ర్యాంకు సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు.

ఇదే విషయమై అహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. నాన్న వ్యవసాయం చేస్తూ.. రిక్షా నడుపుతూ మమ్మల్ని పోషించాడు. తాను చదువుకోలేకపోయానని బాధపడిన నాన్న మాకు ఆ కష్టం రానివ్వలేదు. ఆయన శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు లభించింది. ఇక ప్రణాళికబద్ధంగా చదవడంతోనే ఈరోజు ఐఈఎస్‌ పరీక్షలో రెండో ర్యాంక్‌ను సాధించాను.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన్వీర్‌ అహ్మద్‌ఖాన్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతుంది. తన్వీర్‌ కృషి, పట్టుదల, ప్రతిభను నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top