ఢిల్లీ: దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం. చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన (Census)లో భాగం కుల గణన నిర్వహించడం సరైన నిర్ణయం.
ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర కోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు. కుల గణనతో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను వారికి రావాల్సిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుంది. సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంలో కూడా కుల గణన ఎంతో దోహదపడుతుంది. జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
