ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌.. కెరీర్‌ అవకాశాలు

Environmental Engineering: Eligibility, Salary, Career Scope, Salary - Sakshi

నేను ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్నాను. అర్హతలు, కెరీర్‌ అవకాశాల గురించి వివరించండి? 

ప్రకృతిని ప్రేమించే వారికి, పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా బావించే వారికి ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ మంచి కెరీర్‌గా చెప్పొచ్చు. పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించడం.. వ్యర్థాలను రీసైక్లింగ్‌ విధానాలతో శుద్ధి చేయడం.. నింగి, నేల, నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు సిఫార్సులు చేయడం వంటి విధులను ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

కోర్సులు: దేశంలోని చాలా విద్యాసంస్థలు యూజీ, పీజీ స్థాయిలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలతోనే బీఈ/బీటెక్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌; పీజీ కోర్సులకు గేట్‌ వంటి పరీక్షల్లో అర్హత సాధించాలి. ఈ కోర్సుల్లో చేరినవారికి బయాలజీ, కెమిస్ట్రీ, సాయిల్‌ సైన్స్, ఇంజనీరింగ్‌ సూత్రాలు, అనువర్తనాలు వంటి వాటిపై అవగాహన లభిస్తుంది. 

అర్హతలు: ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివి ఉండాలి. 

కోర్సులను అందించే పలు విద్యా సంస్థలు: ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్, బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌ తదితర ఐఐటీలు, పలు నిట్‌లు, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు. 

జాబ్‌ ప్రొఫైల్స్‌: హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్‌మెంట్‌ సైంటిస్ట్, ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్, వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్, ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌ మెంటల్‌ లాయర్‌. 

కెరీర్‌: ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖలు, ఎన్‌జీవోలు, నిర్మాణ సంస్థలు, పర్యావరణ ఆధారిత సంస్థలు వంటి వాటిలో అవకాశాలను పొందవచ్చు. ఇవే కాకుండా ఫెర్టిలైజర్‌ ప్లాంట్లు, మైన్స్, రిఫైనరీలు, టెక్స్‌టైల్‌ మిల్స్, అర్బన్‌ ప్లానింగ్, వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ అగ్రికల్చర్, అటవీ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంతర్జాతీయంగా యునైటెడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్, ఇంటర్‌ గవర్నమెంట్‌ ప్యానల్‌ ఆన్‌ క్లయిమెట్‌ ఛేంజ్, ఎర్త్‌ సిస్టమ్‌ గవర్నమెంట్‌ ప్రాజెక్ట్‌ వంటి వాటిలో అవకాశాలు అందుకోవచ్చు. 

వేతనాలు:  పనిచేసే సంస్థ, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంగా పొందవచ్చు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top