ఈడీ ముందుకు హేమంత్‌ సోరెన్‌ | Sakshi
Sakshi News home page

ఈడీ ముందుకు హేమంత్‌ సోరెన్‌

Published Fri, Nov 18 2022 6:21 AM

ED questions Hemant Soren for over six hours in mining lease case - Sakshi

రాంచీ: అక్రమ గనుల తవ్వకం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. రాంచీ కార్యాలయంలో ఆయనను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించింది. ఈడీ కేసులో ప్రశ్నించేందుకు గతంలో ఆయనకు పలుమార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేయగా వ్యక్తిగత, అధికారిక కారణాలు చూపుతూ ఇన్నాళ్లూ గైర్హాజరైన విషయం విదితమే. గురువారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన సోరెన్‌.. ఈడీకి ఒక లేఖ రాశారు. నిజాలేవిటో నిర్ధారించుకోకుండా ‘సంచలన ప్రకటనలు’ చేయొద్దని లేఖలో సూచించారు.

‘ మొత్తం జార్ఖండ్‌లో గత రెండేళ్లలో గనులు, ఖనిజాల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరేమో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో అవినీతి చేయాలంటే ఒక్క సాహెబ్‌గంజ్‌లోనే 8 కోట్ల మెట్రిక్‌ టన్నుల రాళ్లను తవ్వాలి. చట్టబద్ధంగా తవ్విన దానికంటే ఇది ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ. ఇది సాధ్యమా?’ అంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. ‘జేఎంఎం పార్టీ నుంచి నేను గెంటేసిన రవి కేజ్రీవాల్‌ బీజేపీ తరఫున మాట్లాడుతూ నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. ఈ కేసును ఎలాంటి రహస్య అజెండా లేకుండా దర్యాప్తుచేయండి’ అని ఈడీని కోరారు. తనపై బీజేపీ కుట్ర పన్నుతోందని అంతకుముందు మీడియాతో అన్నారు. దర్యాప్తును ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రభావితం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement