ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసిన ఎంపీలు.. ఢిల్లీకి జంప్‌! | Delhi Moves Spark UBT Split Speculation | Sakshi
Sakshi News home page

ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసిన ఎంపీలు.. ఢిల్లీకి జంప్‌!

Jun 17 2026 7:16 AM | Updated on Jun 17 2026 8:10 AM

Delhi Moves Spark UBT Split Speculation

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలు తప్పవా?. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఎంపీలు పార్టీని వీడబోతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరే వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు లోక్‌సభ ఎంపీలు 24 గంటలుగా అదిష్టానానికి అందుబాటులో లేకపోవడంతో ఉద్దవ్‌ శిబిరం ఆందోళన చెందుతోంది. 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా కొందరు ఎంపీలతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఫోన్‌కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ‘‘ఆరుగురు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయి. ఇంటికి వెళ్తే లేరనే సమాధానం వచ్చింది. ఎక్కడున్నారో ఆరా తీస్తే.. ఢిల్లీకి వెళ్లారని తెలిసింది.  పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం కోసం వెళ్లామని వాళ్లు చెప్పారట. కానీ, మా అధిష్టానం మాత్రం అలాంటి మీటింగ్‌ ఏం నిర్వహించడం లేదు’’ అని ఉద్దవ్‌ వర్గానికి చెందిన ఓ నేత చెబుతున్నారు. అయితే..  ఏక్‌నాథ్ షిండే వర్గం ఆ మీటింగ్‌ నిర్వహిస్తుండడంతో.. తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. 

శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, సంజయ్ జాధవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు రాజాభౌ వాజే కూడా చేరే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీలో శ్రికాంత్ షిండే నివాసంలో కొందరు యూబీటీ ఎంపీలు సమావేశమయ్యే అవకాశం ఉందని, ఆ సమావేశానికి ఏక్‌నాథ్ షిండే కూడా హాజరయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అనంతరం వారు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి, ముందుగా ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్‌గా ఏర్పడి, తర్వాత షిండే శివసేనలో విలీనం అయ్యే దిశగా అడుగులు వేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ కేంద్రంగా రాజకీయ వ్యూహాలు..
ఈ ఎంపీలు ముందుగా ప్రత్యేక లోక్‌సభ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత షిండే శివసేనలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో వారు లోక్‌సభ స్పీకర్‌ను కూడా కలిసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక షిండే వర్గం కూడా ఈ పరిణామాలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను విశ్వసించే ప్రజాప్రతినిధులకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. దీంతో విలీనం ఖాయమనే చర్చా జోరందుకుంది.

ఉద్ధవ్ వర్గం కౌంటర్‌
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు గెలుచుకోగా, ఏక్‌నాథ్ షిండే వర్గం 7 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం యూబీటీకి ఉన్న ఈ 9 మంది ఎంపీల్లో పలువురు షిండే శిబిరంతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి తొమ్మిది మంది ఎంపీల్లో కేవలం నలుగురే ప్రత్యక్షంగా హాజరు అయ్యారు. మిగిలిన వారు ఆన్‌లైన్, ఫోన్ ద్వారా పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెబుతుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ఉద్ధవ్‌కు అత్యంత సన్నిహితులుగా భావించే ఎంపీలు అర్వింద్ సావంత్, అనిల్ దేశాయ్ ఢిల్లీకి చేరుకోగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇప్పటికే అక్కడే మకాం వేశారు. మరోవైపు, ఇటీవల ఉద్ధవ్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాధవ్‌తో భేటీ కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రచారాన్ని ఉద్ధవ్ వర్గం మొదటి నుంచి ఖండిస్తోంది.

పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉన్నారని, పార్టీ చీలికపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. పార్టీకి ఎలాంటి తక్షణ ప్రమాదం లేదని, 60 ఏళ్ల చరిత్ర కలిగిన శివసేన ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొందరు ఎంపీలను ఆకర్షించేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున అడ్వాన్స్‌లు ఇస్తున్నారనే సంచలన ఆరోపణలు కూడా చేశారు.

ఆపరేషన్‌ టైగర్‌
2022లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన చీలిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో మరోసారి అసంతృప్తి సంకేతాలు కనిపిస్తుండటం, ఆ ఎంపీలను తమ గూటికి చేర్చుకునేందుకు షిండే వర్గం ప్రయత్నిస్తోందనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తోంది. ఈ రాజకీయ వ్యూహానికే "ఆపరేషన్ టైగర్" అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకవేళ ఈ వ్యూహం ఫలిస్తే ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి ఇది మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ వర్గాలు ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో వెలుగుచూసిన అసంతృప్తి పరిణామాలతో పోలుస్తున్నాయి. అక్కడి పరిణామాల తరహాలోనే యూబీటీలోనూ తిరుగుబాటు జరుగుతుందా? లేదంటే ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితిని చక్కదిద్దగలరా? అన్న ఉత్కంఠ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement