
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించి అత్యవసర పరిస్థితులకు సన్నద్ధంలో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు సెలవులు రద్దు చేసింది.
ఢిల్లీ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ కనిపించారు. ప్రముఖ సందర్శనా స్థలం ఇండియా గేట్ లోని సి-హెక్సాగాన్ చుట్టూ ఉన్న రహదారిలో జనాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. అయితే, ఈ ప్రాంతంలో సాధారణంగా నిర్వహించే సాధారణ ట్రాఫిక్ నియంత్రణ కసరత్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ అధికారికి సెలవులు మంజూరు చేయరాదని కాంపిటెంట్ అథారిటీ ఆదేశించిందని సర్వీసెస్ డిపార్ట్మెంట్ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సెలవులను కూడా రద్దు చేసినట్లు అధికారులు ధృవీకరించారు.
