Pegasus: కేంద్రం కీలక ప్రకటన

Defence Ministry In Parliament No Transaction With Pegasus Maker - Sakshi

న్యూఢిల్లీ: పెగసెస్‌ స్పైవేర్‌ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పెగసస్‌ స్పైవేర్‌ నిఘా నివేదికలపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టు బట్టాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి విపక్షాలు పెగసస్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం విపక్షాల డిమాండ్లపై కేంద్రం స్పందించింది. పెగసస్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 

పెగాసస్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ విక్రేత అయిన ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌ఓతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోమవారం రాజ్యసభలో రక్షణ మంత్రిత్వ శాఖ సమాధానంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఏవైనా లావాదేవీలు జరిపిందా లేదా అన్న ప్రశ్నకు రక్షణ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. "ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ఎలాంటి లావాదేవీలు జరపలేదు" అని జూనియర్ రక్షణ మంత్రి అజయ్ భట్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

పెగసస్‌తో తాము ఎవరిపైనా అక్రమ నిఘా నిర్వహించలేదని ప్రభుత్వం ఇప్పటివవరకు చెప్తూ వచ్చింది. కానీ ఈ సమాధానం విపక్షాలను సంతృప్తిపరిచేదిగా లేదు. ఈ క్రమంలో విపక్షాలు కేంద్రం ముందు ఒకే ప్రశ్నను ఉంచాయి. అదేంటంటే.. కేంద్రానికి ఎన్‌ఎస్‌ఓతో ఏదైనా సంబంధం ఉందా.. అలానే దేశ పౌరులపై కేంద్రం నిఘా ఉంచిందా లేదా అనే దానికి సూటిగా జవాబు చెప్పాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖలు లక్ష్యంగా చేసుకుని వారిపై నిఘా పెట్టారని గ్లోబల్ మీడియా కన్సార్టియం నివేదించినప్పటి నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతున్నాయి. ఇక ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top