నారీ శక్తితో గణతంత్రం వచ్చే ఏడాది మహిళలతోనే రిపబ్లిక్‌ డే పరేడ్‌ | Sakshi
Sakshi News home page

నారీ శక్తితో గణతంత్రం వచ్చే ఏడాది మహిళలతోనే రిపబ్లిక్‌ డే పరేడ్‌

Published Mon, May 8 2023 6:02 AM

Defence Ministry to organise all women Republic Day parade in 2024  - Sakshi

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌ అంటే మన దేశ త్రివిధ బలగాల శక్తిని ప్రపంచానికి చాటడమే. యుద్ధ శకటాలు,  విమానాల విన్యాసాలు, కొత్త ఆయుధాల ప్రదర్శన ఇలా పరేడ్‌ అంటే కదనరంగంలో మన సత్తా ఎంతో ప్రదర్శించడమే. అలాంటి పరేడ్‌ను వచ్చే ఏడాది మహిళా శక్తితో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నింగి నేలా నీరు అంతా మాదే అంటూ నినదిస్తున్న మహిళల భాగస్వామ్యం ఇటీవల కాలంలో త్రివిధ బలగాల్లో పెరుగుతోంది.

యుద్ధభూమిలోకి అడుగు పెట్టడానికి కూడా మహిళలు సై అంటున్నారు. కేంద్ర బలగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం 2024 జనవరి 26న కర్తవ్యపథ్‌లో జరగనున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌ను కేవలం మహిళలతో నిర్వహించాలని రక్షణ శాఖ ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. దీనిపై ఫిబ్రవరిలో రక్షణ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో త్రివిధ బలగాల అధిపతులతో ఒక సమావేశం కూడా జరిగిందని ఆదివారం రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

త్రివిధ బలగాల్లోని మహిళా అధికారులే రిపబ్లిక్‌ డే కవాతుని నడిపిస్తారని ఆ సమావేశం నిర్ణయించింది. ఈ విషయాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకి కూడా సమాచారం అందించారు. రక్షణ , హోం సంస్కృతి పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా దీనిని ఎలా అమలు చేయాలో చర్చిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రిపబ్లిక్‌ డేలో నారీ శక్తి థీమ్‌ను ప్రధానంగా చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట, త్రిపుర రాష్ట్రాలు నారీశక్తి థీమ్‌తో శకటాలు రూపొందించాయి. ఇక వచ్చే ఏడాది అందరూ మహిళలతోనే పరేడ్‌ సాగనుంది.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement