Covid Vaccination in India: వ్యాక్సిన్‌లోనూ వివక్ష..!

Covid Vaccination in India: Vaccinated More Men Than Women - Sakshi

మగవారితో పోల్చితే మహిళలకు తక్కువగా వ్యాక్సినేషన్‌

ఏపీ, తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లోనే మగవారితో సమానంగా టీకాలు

యూపీ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య భారీగా వ్యత్యాసాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మనకు శ్రీరామరక్ష కాగా, ఆ వ్యాక్సిన్‌ అందించడంలోనూ మహిళల పట్ల వివక్షే కొనసాగుతోంది. దేశంలో మగవారితో పోల్చితే మహిళలు తక్కువగా వ్యాక్సిన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య అంతరం జాతీయస్థాయిలో చూస్తే 4% కాగా, కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి చోట్ల పురుష–స్త్రీ నిష్పత్తి అంతరం 10 శాతానికి పైగా ఉన్నట్టు వెల్లడవుతోంది.

ఇక నాగాలాండ్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో మాత్రం ఈ తేడా 14% వరకు ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల నమోదు సంఖ్య తక్కువగానే ఉన్నా వ్యాక్సినేషన్‌ విషయంలో మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆయా గణాంకాలను బట్టి ప్రస్ఫుటమైంది. నాగాలాండ్‌లో ఈ తేడా 14.6%, జమ్మూ,కశ్మీర్‌లో 13.76%, యూపీ, పంజాబ్, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో 10–13% మధ్యలో ఉండగా, చండీగడ్‌లో 11% ఉంది.  

కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే లింగబేధం లేకుండా వ్యాక్సిన్‌.. 
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత పట్టిపీడిస్తుండడంతో కరోనా నుంచి రక్షణ పొందేందుకు టీకా వేయించుకునేందుకు వ్యాక్సిన్‌ స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు ఇటీవలి కాలంలో ఎక్కడ లేని రద్దీ పెరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మగవారు–ఆడవారు అనే లింగవివక్ష మరింతగా తెరపైకి వచ్చింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని సందర్భాల్లో మగవారి కంటే ఎక్కువ లేదా వారిలో సమానంగా వ్యాక్సిన్లు వేసిన పరిస్థితి నెలకొంది. 

కేంద్రపభుత్వ ఆధ్వర్యంలోని ‘కోవిన్‌’ పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం
దేశవ్యాప్తంగా మొత్తం 17.78 కోట్ల మందికి (గురువారం నాటికి)వ్యాక్సిన్లు వేయగా వారిలో 7.3 కోట్ల మంది పురుషులు, 6.5 కోట్ల మంది మహిళలు, 19వేల మంది ఇతరులున్నారు. తాజా గణాంకాల ప్రకారం (శుక్రవారం నాటికి) చూస్తే... ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 75,70,522 మంది వ్యాక్సినేషన్‌ వేయగా వారిలో 54,74,395 మందికి మొదటి డోస్, 20,96,127 మందికి రెండో డోస్‌ వేశారు. వీరిలో పురుషులు, మహిళల సంఖ్య సమానంగా ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే మొత్తం 55,13,261కి వ్యాక్సిన్లు వేశారు. అందులో 44,49,899 మందికి మొదటి డోస్, 10,63,362 మందికి రెండో డోస్‌ వేయించుకున్నారు. వీరిలో స్త్రీ, పురుషుల సంఖ్య సమానంగానే ఉంది.  
 

చదవండి:
Corona: పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే..

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై ఆందోళన వద్దు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top