డేంజర్‌ జోన్లో అపార్టుమెంట్లు

Covid Cases Are High In Apartments In Bangalore - Sakshi

 రాజధానిలో అక్కడే  కరోనా అధికం

శివారు వార్డుల్లోనూ తీవ్రం

బనశంకరి: బెంగళూరులో అపార్టుమెంట్లు కరోనా వైరస్‌కు నిలయాలుగా మారాయనే ఆరోపణలున్నాయి. దీనికి అడ్డుకట్టకు బీబీఎంపీ చేస్తున్న చర్యలు ఫలించడం లేదు. బెంగళూరుకు సరిహద్దు వార్డులో డేంజర్‌జోన్లుగా మారగా, జనాభా అధికంగా ఉండే, వాణిజ్య ప్రాంతాలైన సిటి మధ్య ప్రాంతాల్లో  కరోనా తగ్గుముఖం పట్టింది. జనసాంద్రత తక్కువగా ఉండే బెంగళూరు నగర శివారు వార్డుల్లో కరోనా ప్రబలడం విశేషం. వసంతనగర ఎంబెసీ అపార్టుమెంట్‌లో  ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి మొత్తం అపార్టుమెంట్స్‌ను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. వేలాది మంది ఒకేచోట నివసిస్తుండడం కరోనా ప్రబలడానికి కారణంగా అనుమానాలున్నాయి.

అపార్టుమెంట్లే అధిక క్వారంటైన్లు  
అపార్టుమెంట్లలో కరోనా బెడద వల్ల సిటీలో కంటైన్మెంట్‌ జోన్లు 172కి పెరిగాయి. ఇందులో 80  అపార్టుమెంట్లే. అందులో మహాదేవపుర అత్యధికంగా.. అంటే 49 కంటైన్మెంట్‌ జోన్లు ఉండడంతో స్థానికుల్లో కలకలం రేపుతోంది. మహాదేవపుర 49 కంటైన్మెంట్లలో 28 అపార్టుమెంట్లు ఉన్నాయి. బొమ్మనహళ్లిలో ఉన్న 24 కంటైన్మెంట్‌ జోన్లన్నీ అపార్టుమెంట్లు కావడం గమనార్హం. తూర్పు వలయంలో 36 కంటైన్మెంట్‌ జోన్లలో 13 అపార్టుమెంట్లు, దక్షిణలో 21 కంటైన్మెంట్‌ జోన్లలో 8 అపార్టుమెంట్లు, పశ్చిమ వలయంలో 11 కంటైన్మెంట్‌జోన్లులో రెండు అపార్టుమెంట్లు ఉన్నాయి. యలహంక 25 కంటైన్మెంట్‌ జోన్లలో 11 అపార్టుమెంట్లు, ఆర్‌ఆర్‌.నగరలో 5 కంటైన్మెంట్‌జోన్లలో రెండు అపార్టుమెంట్లు, దాసరహళ్లిలో ఒక విల్లాను కంటైన్మెంట్‌జోన్‌గా గుర్తించారు.

డేంజర్‌ వార్డులు ఇవే  
బేగూరు, బెళ్లందూరు, రాజరాజేశ్వరినగర, హూడి, హ­గ­దూరు, వర్తూరు, హొరమావు, బసవనపుర, విజ్ఞా­న­న­­గర, విద్యారణ్యపురల్లో ఎక్కువగా కేసులు వస్తున్నాయి.

కొత్తగా వెయ్యి పాజిటివ్‌లు
సాక్షి, బెంగళూరు: కరోనా తీవ్రత తగ్గినట్లే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,065 మందికి పాజిటివ్‌గా వెల్లడి కాగా, 1,486 మంది కోలుకున్నారు. 28 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,30,529 కి, డిశ్చార్జ్‌లు 28,71,448, మరణాలు 37,007 కి చేరాయి. మరో 22,048 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివిటీ రేటు 0.93 శాతంగా ఉంది.

  • బెంగళూరులో తాజాగా 270 కేసులు, 378 డిశ్చార్జిలు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. 8,054 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
  •  రాష్ట్రంలో కొత్తగా 1,13,580 మందికి కరోనా పరీక్షలు చేశారు. 2,90,794 మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.  

   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top