తగ్గుతున్న కరోనా ఉధృతి!

COVID-19: Situation stabilising, positivity rate down to 12.45 percent - Sakshi

12.45 శాతానికి దిగి వచ్చిన కరోనా పాజిటివిటీ రేటు

మే 10న ఏకంగా 24.83 శాతంగా నమోదైన పాజిటివిటీ రేటు

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రకోపం కాస్తంత తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నెల పదో తేదీన 24.83 శాతంగా ఉన్న కరోనా కేసుల పాజిటివిటీ రేటు మే 22(శనివారం) నాటికి 12.45 శాతానికి దిగిరావడమే ఇందుకు తగిన తార్కాణం. పాజిటివిటీ రేటుతోపాటు రోజువారీ కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు, యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ శనివారం మీడియాకు చెప్పారు. దేశవ్యాప్తంగా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతంపైగానే ఉందని ఆయన వెల్లడించారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్‌ కేసులున్నాయి. 18 రాష్ట్రాల్లో 15 శాతానికిపైగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. రోజురోజుకూ కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని, మే 10న 24.83 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 22వ తేదీకి 12.45 శాతానికి పడిపోయిందని లవ్‌ అగర్వాల్‌ వివరించారు.

తగ్గిన వ్యాక్సిన్‌ వృథా
వ్యాక్సిన్‌ డోస్‌ల వృథా సైతం తగ్గిందని అగర్వాల్‌ చెప్పారు. మార్చి ఒకటో తేదీన 8 శాతమున్న వృథా.. ప్రస్తుతం ఒక్క శాతానికి తగ్గిపోయిందన్నారు. అదేకాలానికి కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వృథా 17 శాతం నుంచి 4 శాతానికి దిగిరావడం సానుకూల అంశమన్నారు.  

కొత్తగా 2.57 లక్షల పాజిటివ్‌ కేసులు
గత 24 గంటల్లో 2.57 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మూడు లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది ఆరోరోజు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగింది. మరోవైపు రికార్డుస్థాయిలో గత 24 గంటల్లో 4,194 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్‌ బాధితుల మొత్తం మరణాల సంఖ్య 2,95,525కు పెరిగింది. దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 29,23,400కు తగ్గింది. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో కేవలం 11.12 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉండటం గమనార్హం. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 69.94% కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

87.76 శాతం రికవరీ రేటు
ఇప్పటిదాకా భారత్‌లో మొత్తం 2,30,70,365 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు మరింత మెరుగై 87.76 శాతానికి చేరుకుంది. కాగా, మరణాల రేటు 1.12 శాతంగా నమోదైంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తంగా 32,64,84,155 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 20,66,285 శాంపిళ్లను పరీక్షించారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,263 మంది చనిపోయారు.

కేంద్రం కేటాయింపులు
బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు ఔషధాలను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాలు, యూటీలకు 23,680 వయల్స్‌ యాంఫోటెరిసిన్‌–బి పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌కు 2,310 వయల్స్, తెలంగాణకు 890 వయల్స్‌ కేటాయించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top