కోవిడ్ మృతుల కుటుంబాలకు ఫించన్

Covid-19: More Benefits via ESIC, EPFO for Bereaved Families - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ పథకాలలో చేరిన ఉద్యోగుల కుటుంబాలకు ఆ ఉద్యోగి రోజువారీ వేతనంలో 90 శాతం మొత్తాన్ని కుటుంబానికి ప్రభుత్వం ఫించనుగా అందించనుంది. గతేడాది మార్చి 24 నుంచి నుంచి మార్చి 24,2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది అని తెలిపింది. కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈడీఎల్ఐ పథకం కింద వర్తించే భీమా ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. 

అలాగే, గరిష్ట భీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కనీస భీమా మొత్తాన్ని రూ .2.5 లక్షలుగా పునరుద్ధరించింది. గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. సాధారణ, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కూడా లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేస్తుందని స్పష్టం చేసింది. రాబోయే 3 సంవత్సరాల్లో, అర్హతగల కుటుంబ సభ్యులకు రూ. 2021-22 నుండి 2023-24 సంవత్సరాలలో ఈడీఎల్ఐ ఫండ్ నుంచి రూ.2185 కోట్లు చెల్లించనున్నట్లు అంచనా వేసింది.

పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్
"ఈ సంక్షేమ చర్యలు COVID-19 వ్యాధి కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు చాలా అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. మహమ్మారి నుంచి ఈ సమయాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని కాపాడుతుంది" అని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం 'పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్' పథకాన్ని ప్రకటించింది. కరోనా వల్ల అనాథ అయిన పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి వారి పేరిట రూ.10 లక్షల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఐదేళ్ల పాటు ప్రతీ నెలా వారికి స్టైఫండ్ అందిస్తుంది. పిల్లలకు 23 ఏళ్ల వయసు వచ్చాక ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని వారికి అందిస్తారు. 

దాన్ని వ్యక్తిగత ఖర్చులకు, చదువులకు లేదా వృత్తిపరమైన అవసరాలకు ఎలాగైనా వాడుకోవచ్చు. అలాగే, ఈ పథకం కింద అనాథ పిల్లలకు ఉచిత విద్య,ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షలు ఆరోగ్య భీమా అందించనున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువుల కోసం తీసుకునే విద్యా రుణాలపై వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. చదువులకు స్కాలర్‌షిప్స్ కూడా అందిస్తుంది. దేశంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన ఎంతోమంది చిన్నారులకు ఈ పథకం లబ్ది చేకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇదే తరహా పథకాలను ఇప్పటికే ప్రకటించాయి.

చదవండి: 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top