కోర్టులూ ఆస్పత్రుల్లా 24/7! | Courts must work like hospitals that function 24x7, Says CJI Surya Kant | Sakshi
Sakshi News home page

కోర్టులూ ఆస్పత్రుల్లా 24/7!

May 17 2026 4:19 AM | Updated on May 17 2026 4:19 AM

Courts must work like hospitals that function 24x7, Says CJI Surya Kant

సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆశాభావం 

జబల్‌పూర్‌: వైద్యాలయాల మాదిరిగా న్యాయస్థానాలూ 24 గంటలూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ వాళ్ల బాధలు, ఆకాంక్షలను నెరవర్చే రాజ్యాంగబద్ధ కేంద్రాలుగా పరిఢవిల్లాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిలషించారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర హైకోర్టు పరిధిలో కొత్తగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధిచేసిన సందర్భంగా ‘సమీకృత ఐక్య డిజిటల్‌ వేదికగా న్యాయసాధికారత’పేరిట జరిగిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. 

‘‘ఆస్పత్రుల్లా కోర్టులూ వారంలో ప్రతిరోజూ ప్రతిగంటా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడు ప్రజల బాధలు, ఆకాంక్షలను న్యాయవ్యవస్థ సత్వరం తీర్చగలదు. సాంకేతికతో మాత్రమే కోర్టుల సమయం వృథాకాకుండా నివారించగలం. న్యాయవ్యవస్థలో సమర్థవంతమైన టెక్నాలజీ, కృత్రిమమేథ ఆధారిత మౌలికవసతుల కల్పన తర్వాత వేగవంతమైన న్యాయవితరణ సాధ్యమవుతుంది. తక్షణం ఉపశమనం కల్పించేలా ప్రజలకు న్యాయం అందించాలి. అందుకోసమే న్యాయవ్యవస్థ అనేది 24/7 పనిచేయాల్సిందే’’అని అన్నారు. 

యువతపై అలాంటి భాష వాడలేదు.. 
సరైన వృత్తి ఎంచుకునే సామర్థ్యంలేక యువత పరాన్నజీవుల్లా మీడియా, సోషల్‌మీడియా, లాయర్, సామాజిక కార్యకర్తల్లా మారి దేశవ్యవస్థను నాశనంచేస్తున్నారంటూ సీజేఐ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంకావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఒక వర్గం దురుద్దేశంతో నా మాటలను తప్పుగా వక్రీకరించింది. తప్పుడు, బోగస్‌ డిగ్రీ పట్టాలు సంపాదించి కొందరు లాయర్‌ వృత్తిలోకి వస్తున్నారనే ఉద్దేశంతో నిన్న అలా మాట్లాడా. యువతను అస్సలు కించపరచలేదు. భారతీయ యువత నాకెంత గౌరవం ఇస్తారో నవభారత మూలస్తంభాలుగా వాళ్లనూ అంతకంటే ఎక్కువగా నేను గౌరవిస్తా’’అని సీజేఐ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement