బెంగాల్ సీఎం అధినేత మమతా బెనర్జీ ఆందోళన
కోల్‌కతా: పార్లమెంట్ లోపల ఎంపీలు జైహింద్, వందేమాతరం అనే నినాదాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నట్లు వచ్చిన వార్తలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందో తనకు తెలియదని, ఎంపీలతో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకుంటానని చెప్పారు. బుధవారం కోల్‌కతాలో రాజ్యాంగ దినోత్సవంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించిన నినాదాలను నిషేధిస్తే మన గుర్తింపును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుందని వెల్లడించారు. వందేమాతరం మన జాతీయ గీతమని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం నినాదం అందరినోట మార్మోగిందని, ఈ విషయం మర్చిపోవద్దని కోరారు.
పార్లమెంట్ లోపల జైహింద్, వందేమాతరం నినాదాలను అడ్డుకోవాలన్న ఆలోచన సరైంది కాదని సూచించారు. బెంగాల్‌కు చెందిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్‌ని బీజేపీ నాయకులు కించపరుస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ గడ్డను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. బెంగాల్ కూడా భారతదేశంలో భాగమేనని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు.


