కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

Congress MLA Candidate Madhava Rao Passed Away With Corona In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: ప్రజా మద్దతుతో అసెంబ్లీలో అడుగుపెడతారనుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు మృత్యుఓడిలోకి చేరారు. ఫలితాలకు ముందే కరోనా కబళించింది. రెండు సార్లు నెగటివ్‌ వచ్చినా, ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన మృతిచెందినట్టు ఆదివారం వైద్యులు ప్రకటించారు. విరుదునగర్‌ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు అసెంబ్లీ స్థానం కోసం కాంగ్రెస్‌లో పలువురు నేతలు తీవ్రంగానే పట్టుబట్టారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కే ఆ సీటు దక్కింది. అయితే, అభ్యర్థి ఎంపికలో సాగిన వివాదా ల తర్వాత ఎట్టకేలకు మాధవరావు అలియాస్‌ సెల్వదురై తన బలాన్ని చాటుకున్నారు.

విరుదునగర్‌ జిల్లా వత్త్రాయిరుప్పులో పుట్టి, న్యాయవాదిగా చెన్నైలో స్థిరపడి, పలు వ్యాపారాల్లో రాణిస్తూ వచ్చిన మాధవరావుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం ఇచ్చింది. దీంతో మార్చి 17న నామినేషన్‌ వేసిన మూడురోజులకే అనారోగ్యం బా రినపడ్డారు. కరోనా లక్షణాలు ఆయనలో కనిపించడంతో మదురైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  అభ్యర్థి ఆస్పత్రిలో ఉండడంతో కాంగ్రెస్‌ నేతలు శ్రీవిళ్లిపుత్తూరుకు కదిలారు. చెన్నైలోని మాధవరావు కుమార్తె దివ్య తన చంటిబిడ్డను భుజాన వేసుకుని తండ్రి కోసం ప్రచారంలో పరుగులు తీశారు.  

ఇన్ఫెక్షన్‌తో.. 
ఎన్నికల్లో మాధవరావుపై సానుభూతి చూపిన ఓట ర్లు ఎక్కువే. ఆయన కుమార్తె చంటిబిడ్డను వేసుకుని ఇంటింటా తిరగడంతో తామున్నామని భరోసా ఇచ్చిన గ్రామీణ ఓటర్లు ఎక్కువే. ఆమేరకు ఈనెల ఆరో తేదీన ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆదివారం ఉదయం 7.50 గంటలకు మాధవరావు మరణించినట్టుగా మదురై ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు రెండుసార్లు కరోనా నిర్ధారణ పరిశోధన జరిగినట్టు, నెగటివ్‌ అని వచ్చినా, ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్‌ కారణంగా గుండెపోటు వచ్చినట్టు ప్రకటించారు.

కరోనా లక్షణాలు ఆయనలో కనిపించడంతోనే అందుకు చికిత్స అందించినా, ఫలితం లేకుండా పోయినట్టు వైద్యులు వివరించారు. ఈ సమాచారంతో మాధవరావు కుటుంబం, మద్దతుదారులు కన్నీటిసంద్రంలో మునిగారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కరోనా నెగటివ్‌ వచ్చినా, లక్షణాలు కనిపించినట్టుగా వైద్యులు ప్రకటించడంతో భౌతిక కాయాన్ని అందుకు తగ్గ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్‌ చేశారు. సాయంత్రం మదు రై తత్తనేరి శ్మశాన వాటికలో ఆయన భౌతికకాయా న్ని దహనం చేశారు. మాధవరావు సతీమణి సీతై ప్రభుత్వ వైద్యురాలు. ఆమె 2017లో మరణించారు. కుమార్తె దివ్య తండ్రికి తోడుగా ఉంటూ వచ్చారు. 

నివాళులు.. 
మాధవరావు మరణ సమాచారంతో సీఎం పళనిస్వా మి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకుశాంతి కల్గాలని ప్రార్థించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సంతాపం తెలుపుతూ విజయకేతనంతో అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన మాధవరావును ఇలా మృతువు కబళించడం తీవ్ర వేదనకు గురి చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి పేర్కొంటూ ఆ సీటు కోసం పోరాడి, పట్టుబడి సా ధించుకున్న మాధవరావు ఫలితాలకు ముందే దూ రం కావడం ఆవేదన కల్గిస్తున్నదన్నారు. ఇక, ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహు పేర్కొంటూ ఆ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. మాధవరావు గెలిచిన పక్షంలో, ఆ నియోజకవర్గం ఖాళీగా ప్రకటించి ఉప ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.  

ఆస్పత్రుల్లో అభ్యర్థులు.. 
ఎన్నికల ప్రచారంలో పరుగులు తీసిన అభ్యర్థులు పలువుర్ని కరోనా తాకిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుని ఇళ్లల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్‌ ఉత్తరం సిపిఐ అభ్యర్థి రవి అలియాస్‌ సుబ్రమణ్యం, అరవకురిచ్చి బీజేపీ అభ్యర్థి అన్నామలై తాజాగా కరోనా బారిన పడ్డారు. వీరు ఆస్పత్రిలో ఉన్నారు. థౌజండ్‌ లైట్స్‌ బీజేపీ అభ్యర్థి, నటి కుష్బూ భర్త , దర్శకుడు సుందర్‌ సి కరోనా బారినపడ్డారు. ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుష్బూ కోసం తీవ్రంగానే ఎన్నికల విధుల్లో సుందర్‌ సి నిమగ్నమైన విషయం తెలిసిందే. అయితే, తాను, తన పిల్లలు నాలుగు రోజుల క్రితం పరీక్ష  చేసుకోగా నెగటివ్‌ వచ్చినట్టు కుష్బూ పేర్కొన్నారు. మళ్లీ పరీక్ష చేసుకుంటామని తెలిపారు.   
చదవండి: తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top