Congress Mallikarjun Kharge Plans To Reorganization Of Congress Working Committee, See Details - Sakshi
Sakshi News home page

సీడబ్ల్యూసీకి కొత్త టీమ్‌! తెలంగాణ నుంచి ఒకరికి చోటు దక్కే చాన్స్‌?  

Jun 14 2023 11:05 AM | Updated on Jun 14 2023 11:56 AM

Congress Mallikarjun Kharge Plans To Reorganization Of CWC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) పునర్‌వ్యవస్థీకరణపై పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే దృష్టి సారించారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండటం, మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవాల్సిన దృష్ట్యా సీడబ్ల్యూసీ నియామకాలను పూర్తి చేసే కసరత్తులో పడ్డారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన పార్టీ మూడు రోజుల ప్లీనరీ సమావేశంలో, వర్కింగ్‌ కమిటీ సభ్యులందరినీ నామినేట్‌ చేసేందుకు పార్టీ అధ్యక్షుడికే పూర్తి అధికారం ఇవ్వాలని స్టీరింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కుల, ప్రాంత, రిజర్వేషన్‌ల ప్రాతినిధ్యం ఆధారంగా సభ్యుల ఎంపికను మొదలుపెట్టినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

రాయ్‌పూర్‌ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు సీడబ్ల్యూసీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, 50 ఏళ్లలోపు యువకులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో వీటి ఆధారంగా ఇప్పటికే కొన్ని పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ లిస్ట్‌పై చర్చలు చేసి నెలలోగా తుది ప్రకటన చేస్తారని సమాచారం.

ఇక సీడబ్ల్యూసీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది చివరన జరుగనున్న ఎన్నికల దృష్ట్యా తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ పార్టీలో అత్యున్నత  పార్లమెంటరీ బోర్డుతో పాటు, కేంద్ర ఎన్నికల కమిటీలో సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. మరోపక్క పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు.తెలంగాణ  నేతలకు బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యత మాదిరే రాష్ట్ర నేతలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీడబ్ల్యూసీలో ప్రాధాన్యమిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ చోటు కల్పించాలని నిర్ణయిస్తే షార్ట్‌లిస్ట్‌లో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పదేళ్ల కింద తెలంగాణ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు సీడబ్ల్యూసీలో సభ్యునిగా ఉండగా, ఆ తర్వాత రాష్ట్రం నుంచి కొత్త సభ్యుడిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement