కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హఠాన్మరణం

Congress Leader Rajiv Tyagi Last Breath Due To Cardiac Arrest - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్‌ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ (బుధవారం) ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. రాజీవ్ త్యాగి మ‌ర‌ణించాడ‌ని కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాజీవ్ త్యాగి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. నిజమైన దేశభక్తుడు, బలమైన నేతను కోల్పోయామని తెలిపింది. త్యాగి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించింది.
(చదవండి: కేంద్ర మంత్రి యశోనాయక్‌ శ్రీపాదకు కరోనా)

కాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఓ ప్రముఖ‌ వార్తా చానెల్‌లో ఆయన డిబేట్‌లో పాల్గొన్నారు. డిబేట్‌ అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇదిలాఉండగా.. గత అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్‌లో మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కీల‌కంగా ప‌నిచేశారు. త్యాగి మృతి పట్ల కాంగ్రెస్‌ కీలక నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షురాలు సోనియా గాంధీ , రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, బీజేపీ నేత సబిత్‌ పాత్రా, ఎన్సీపీ నేత నవాబ్‌మాలిక్‌ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించారు.
(కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top