భారత్‌ జోడో యాత్ర.. 3,570 కిలోమీటర్లు.. 12 రాష్ట్రాలు

Congress Bharat Jodo Yatra Starts 7 September 3500 Kms 12 States - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సెప్టెంబర్‌ ఏడవ తేదీన శ్రీకారం చుట్టనున్న ‘భారత్‌ జోడో యాత్ర’ కన్యాకుమారిలో మొదలై కశ్మీర్‌లో పూర్తికానుంది. ఇందులోభాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఏకంగా 3,570 కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్‌.. జుడే వతన్‌)’  నినాదంతో సుదీర్ఘంగా ఐదు నెలలపాటు ఈ ప్రజాఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు కాంగ్రెస్‌ నడుంబిగించింది. కులమతాలకతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్రభారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. తర్వాత తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూర్‌ మీదుగా యాత్రను కొనసాగిస్తారు. షెడ్యూల్‌లో భాగంగా తెలంగాణలోని వికారాబాద్‌లోనూ యాత్ర ఉంటుంది. మహారాష్ట్రలోని నాందేడ్, తర్వాత జల్గావ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్‌లోని కోటా పట్టణం.. తర్వాత డౌసా, అల్వార్‌లో పాదయాత్ర ముందుకు వెళ్లనుంది. ఉత్తరభారతం విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌ షహర్, తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, అంబాలా(హరియాణా)లనూ పాదయాత్ర పలకరించనుంది. జమ్మూ పట్టణం, ఆ తర్వాత చివరిగా శ్రీనగర్‌లో పాదయాత్ర పూర్తికానుంది. భౌగోళికంగా నదీజలాలు, కొండలు, అటవీప్రాంతం.. పాదయాత్ర మార్గానికి ఆటంకం కలగకూడదని అవి లేని మార్గాల్లో పాదయాత్ర రూట్‌మ్యాప్‌కు కాంగ్రెస్‌ నాయకులు తుదిరూపునిచ్చారు.

100 మంది ‘భారత యాత్రికులు’
పాదయాత్రలో యాత్ర తొలి నుంచి తుదికంటా 100 మంది మాత్రం కచ్చితంగా పాలుపంచుకోనున్నారు. వీరిని ‘భారత యాత్రికులు’గా పిలవనున్నారు. ఏ రాష్ట్రం గుండా అయితే భారత్‌ జోడో యాత్ర మార్గం లేదో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరో 100 మంది ‘అతిథి యాత్ర’లు చేస్తారు. పాదయాత్ర ఉన్న రాష్ట్రాల నుంచి మరో 100 మంది ‘ప్రదేశ్‌ యాత్రికులు’ జతకూడుతారు. అంటే ప్రతిసారి 300 మంది పాదయాత్రికులు కచ్చితంగా ఉంటారు. రోజూ దాదాపు పాతిక కిలోమీటర్ల దూరం యాత్ర ముందుకెళ్తుంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ లోగో విడుదల

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top