యూపీలో ఆలూ కోల్డ్‌స్టోరేజీలో ప్రమాదం

Cold storage roof collapses in Sambhal - Sakshi

కుప్పకూలిన పైకప్పు, 14 మంది దుర్మరణం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో బంగాళదుంపలు నిల్వ చేసే ఒక కోల్డ్‌ స్టోరేజీ పైకప్పు కుప్పకూలిపోయిన ఘటనలో 14 మంది మరణించారు. చాందౌసీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇందిరా రోడ్డులో ఉన్న ఈ కోల్డ్‌ స్టోరేజీ పై కప్పు గురువారం రాత్రి హఠాత్తుగా కుప్పకూలింది. ఆ సమయంలో కోల్డ్‌ స్టోరేజీ లోపల ఆలూ బస్తాలను అన్‌లోడ్‌ చేస్తున్న వర్కర్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయ సిబ్బంది 24 మందిని ఆలూ బస్తాల నుంచి బయటకు తీసుకురాగా వారిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

సహాయ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) ఆఫ్‌ పోలీసు శలభ మాథూర్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన యోగి బాధితుల్ని పరామర్శించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఒక కమిటీ వేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం, గాయపడిన వారికి చికిత్స కోసం రూ.50 వేలు ప్రకటించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న వారిలో ఆరుగురు స్వల్పగాయాలకు చికిత్స తీసుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో నలుగురికి చికిత్స జరుగుతోందని జిల్లా మేజిస్ట్రేట్‌ మనీష్‌ బన్సల్‌ తెలిపారు.  పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ కోల్డ్‌ స్టోరేజీని మూడు నెలల క్రితమే నిర్మించారు. ప్రభుత్వం దగ్గర్నుంచి సరైన అనుమతులు లేకుండానే హడావుడిగా దీని నిర్మాణం కొనసాగించినట్టు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా కోల్డ్‌ స్టోరేజీ సామర్థ్యానికి మించి బంగాళ దుంప బస్తాలు నిల్వ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవే ప్రమాదానికి దారి తీసినట్టు భావిస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top