ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకునే బీజేపీ ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోంది
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ముమ్మాటికీ ఆ పార్టీ కుట్రే
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, రిటర్నింగ్ అధికారే కుట్రదారులు
ప్రధాని మోదీకి వచ్చే నోటీసులన్నింటినీ అఫిడవిట్‌లో చెబుతున్నారా?
నిధుల కేటాయింపులో వివక్ష పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మారిస్తే సరిపోతుంది
కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే తెలంగాణకు ప్రాజెక్టులు వస్తాయి
ఎవరైనా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే సమస్యలొస్తాయన్న సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని, ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకునే ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా, ఊహాజనిత కేసును చూపెట్టి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని అన్నారు.
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్లే కుట్రదారులని ఆరోపించారు. ప్రైవేటు ఫిర్యాదులపై ఇచ్చే నోటీసులన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల అఫిడవిట్‌లో చూపెడుతున్నారా? అని ప్రశ్నించారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి శుక్రవారం మీడియాతో పలు అంశాలపై చిట్‌చాట్ చేశారు.
ఉత్తర కొరియాలో ఓట్లన్నీ కిమ్‌కే..
‘ఇన్నాళ్లూ బీజేపీకి గాడ్సే ఆదర్శం అనుకున్నాం. గాంధేయవాదులకీ, గాడ్సే వారసులకీ యుద్ధం జరుగుతోందని భావించాం. కానీ బీజేపీ ఇప్పుడు కిమ్ జాంగ్‌ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఉత్తర కొరియాలో ఎన్నికల్లో ఒకే పార్టీ పోటీ చేస్తుంది. ఓట్లన్నీ ఆ పార్టీ నేత కిమ్ జాంగ్‌కే పడతాయి. ఆయనే అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు. అదే మాదిరి బీజేపీ ఓట్లు, సీట్లు అన్నీ తమకే దక్కేలా కుట్రలు చేస్తోంది. మీనాక్షి విషయంలోనూ అదే చేసి చూపించింది.
బలం లేకుండా మూడో అభ్యర్థిని పెట్టారు
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా మూడో అభ్యర్థిని పోటీలో పెట్టడం వెనుకే పెద్ద కుట్ర ఉంది. అక్కడ బీజేపీకి గెలిచేంత బలమే లేదు. అయినా అభ్యర్థిని పోటీలో పెట్టారు. మీనాక్షి నామినేషన్ వేశాక కుట్రలకు తెరలేపారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు. ఓ ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో ఆమెకు సమన్లు మాత్రమే జారీ అయ్యాయి.
2023లో ఇద్దరి మధ్యలో జరిగిన వివాదంతో మీనాక్షికి సంబంధం లేదు. అయినప్పటికీ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పార్టీకి కార్యకర్తలా వ్యవహరించి నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరూ కుట్రదారులే. బీజేపీ టాప్ నేతలే దీనికి వ్యూహరచన చేశారు. కేసే లేనప్పుడు తెలంగాణ నుంచి ఈ వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారన్న దానిపై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదు..’అని సీఎం అన్నారు.
కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్‌రెడ్డి ఆడుతున్నారు..
‘తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వొద్దని కిషన్‌రెడ్డి ప్రతి కేంద్రమంత్రినీ కలిసి చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తానే నిలిపివేయించానని బీఆర్‌ఎస్ మాజీమంత్రి కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్‌రెడ్డి ఆడుతున్నారు. ఐఆర్‌ఎఫ్‌సీకి లోన్ ఎందుకు ఇవ్వడంలేదు? 30వ తేదీన రావాల్సిన ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు? ఆర్‌ఆర్‌ఆర్ లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోంది? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా సీఎం ఫడ్నవీస్‌తో మాట్లాడి 1,500 ఎకరాలు తెలంగాణకు ఇప్పించలేరా? రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులపై ప్రధానికి కిషన్‌రెడ్డి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలి.
కేబినెట్ భేటీకి రానని చెప్పాలి..
మేము అడుగుతున్న మెట్రో, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. వీటిపై ఆయన ప్రధాని మోదీని కేబినెట్‌లో ఎందుకు అడగడం లేదు? ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గ సమావేశానికి హాజరుకానని కిషన్‌రెడ్డి చెప్పాలి. లేదంటే కిషన్‌రెడ్డి సహా..రాష్ట్రానికి చెందిన మొత్తం 8మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మెట్రో వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు పేరు వస్తుందని కిషన్‌రెడ్డి ఆపుతున్నారు..’అని రేవంత్ ఆరోపించారు.
నిధుల కేటాయింపుల్లో వివక్ష
‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మారిస్తే సరిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే దేశం ముందుకెళుతుంది. రాష్ట్రం కోరుతున్న ట్రిపుల్ ఆర్, రీజనల్ రింగ్‌రోడ్డు, ఐఐఎం, మెట్రోలకు ఇప్పటికైనా కేంద్రం నిధులచ్చి సహకరించాలి.
జూలైలో మహారాష్ట్రతో చర్చలు..
గోదావరి జలాల వినియోగం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై వచ్చే నెలలో మహారాష్ట్రతో చర్చలుంటాయి. నీతిఆయోగ్ సమావేశం సందర్భంగా దీనిపై ఫడ్నవీస్‌తో మాట్లాడా. వచ్చే నెలలో దీనిపై చర్చిద్దామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి 1,500 ఎకరాలు ఇప్పించలేదా?
హిట్లర్ వ్యాఖ్యలకు వక్రభాష్యం..
రాష్ట్ర కేబినెట్ పునరవ్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చలు జరగలేదు. మంత్రి పదవులపై ఎవరైనా పార్టీ పెద్దలను కలవొచ్చు.. ఏదైనా అడగొచ్చు. బుద్ధి ఉన్నోడు ఎవడూ హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసే నేతలు ఎవరైనా ఆయన రోల్‌మోడల్ అని చెప్పరు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది..’అని సీఎం విమర్శించారు.
వైఎస్ జగన్ సభలకు అనుమతిస్తున్నారా?
‘తెలంగాణకు ఎవరైనా రావొచ్చు..మాట్లాడొచ్చు..పోటీ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. ఏవైనా శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావిస్తే పోలీసులు అనుమతులు ఇవ్వరు. పవన్ కల్యాణ్ సభ విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి సమస్యలు వస్తాయనే అనుమతులు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలకు అనుమతులు ఇస్తున్నారా? శాంతిభద్రతల సమస్యలున్నాయని సభలను తిరస్కరించట్లేదా?. ఇప్పటికి ఎన్ని సభలను అడ్డుకున్నారో వైఎస్ జగన్‌ను అడిగితే ఆయనే జాబితా ఇస్తారు..’అని రేవంత్ అన్నారు.
రాహుల్‌గాంధీతో భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శక్రవారం ఉదయం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా రాహుల్ సూచించినట్లు తెలిసింది.


