న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ను తొలగిస్తూ కేంద్రం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వైదొలిగారు. పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ఆరంభంలోనే ‘ఈ కేసులో నేను విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇందులో విరుద్ధ ప్రయోజనా(కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)లున్నాయి’అని వ్యాఖ్యానించారు. విచారణ నుంచి తప్పుకోవడం సబబని భావిస్తున్నట్లు తెలిపారు. తదుపరి సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించాలని సూచించారు. సీజేఐ అభిప్రాయంతో పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఏకీభవించారు. దీంతో, ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీన మరో ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందని సీజేఐ తెలిపారు. సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని జడ్జీలతో నూతన ధర్మాసనం ఏర్పాటవుతుందని ప్రకటించారు.
తీర్పు వెలువడే వరకు ప్రస్తుత చట్టం యథాతథంగా అమల్లో ఉంటుందని వివరించారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది నెలల్లోనే 2023 డిసెంబర్‌లో పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు కమిషనర్ల నియామకానికి ఏర్పాటయ్యే కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతోపాటు హోం శాఖ సిఫార్సు చేసిన కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు. సీజేఐను మినహాయిస్తూ తీసుకు వచ్చిన కొత్త చట్టంతో ఈసీ నియామక ప్రక్రియ నిష్పాక్షికతను కోల్పోయిందంటూ సుప్రీంలో కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరులు పిటిషన్లు వేశారు. అయితే, ఈసీ ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రతినిధి ఉండటం వల్ల నియామక ప్రక్రియలో నిష్పాక్షికత వచ్చినట్లు కాదని కేంద్రం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం నిబంధనల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.


