
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ ఓవరాక్షన్ చేస్తున్న చైనా, తుర్కియే విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ప్రభుత్వ మీడియా (Chinese State Media) గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. అలాగే, తుర్కియో బ్రాడ్‌కాస్ట్ టీఆర్‌టీపై భారత్ నిషేధం విధించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు భారత్ స్పష్టం చేసింది.
వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై చైనా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. చైనా అధికారిక మీడియా అయినా గ్లోబల్ టైమ్స్.. పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. ఈ నేపథ్యంలో చైనా చర్యలకు భారత్ కౌంటరిచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసేసింది. కాగా, ఉగ్రవాదులు, వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచదేశాలను సమర్థిస్తుంటే.. ఈ అంశంలో మాత్రం చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్ అకౌంట్‌ను విత్‌హెల్డ్‌లో ఉంచింది.

The 'X' account of Chinese propaganda media outlet 'Global Times' withheld in India. pic.twitter.com/B9Q941FTjX
— ANI (@ANI) May 14, 2025
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 ప్రదేశాల్లో 24 ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. కానీ పాకిస్తాన్‌కు అనుకూలంగా చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందని తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ..‘ఆపరేషన్ సిందూర్‌పై పాక్ అనుకూల సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మీడియా సంస్థలు వాటి మూలాలను నిర్ధారించకుండా ఈ దుష్ప్రచారాన్ని వ్యాపింపజేయడం జర్నలిజం నైతికతకు విరుద్ధం’ అని వ్యాఖ్యానించింది. భారత సమాచార శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) Fact Check వెల్లడించిన విషయాల ప్రకారం, గతంలో కూలిన యుద్ధ విమానాల దృశ్యాలను ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూలిపోయినవిగా ప్రచారం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.