రన్నింగ్‌ ట్రైన్‌ ఫుట్‌బోర్డుపై ఆయుధాలతో వీరంగం.. ఆకతాయిలు ఆట కట్‌

Chennai Police Arrested Students Over Train Video Viral - Sakshi

చెన్నై: రన్నింగ్‌ ట్రైన్‌ ఫుట్‌బోర్డులో నిల్చుని.. కత్తులు, కొడవళ్లతో వీరంగం సృష్టించిన ఆకతాయిల ఆట కట్టించారు పోలీసులు. వాళ్లను కాలేజీ విద్యార్థులుగా గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యారు. ఈ విషయాన్ని చెన్నై డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. 

రైలు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ.. ప్లాట్‌ఫామ్‌పైకి పదునైన ఆయుధాలు దూస్తూ.. గోల చేస్తూ ముగ్గురు యువకులు హల్‌ చల్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇలాంటి వాళ్ల వల్ల దేశానికి ఏం ఉపయోగమంటూ తిట్టిపోశారు కొందరు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. గుమ్మిడిపూండికి చెందిన అన్బరసు, రవిచంద్రన్‌ను, పొన్నేరికి చెందిన అరుల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గురు ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులుగా నిర్ధారించారు. 

రైళ్లలో, రైల్వే ప్రాంగణాల్లో ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తన, ప్రమాదకరమైన విన్యాసాలను సహించేది లేదంటూ అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణాలకు సంబంధించిన ఘటనలు ఇంటర్నెట్‌లో వైరల్‌కావడం, రైల్వే శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో..  రైల్వే శాఖ సకాలంలో స్పందించేందుకు యత్నిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top