Chandigarh University Objectionable Videos Row: Police Say Accused Leaked Her Own Clip - Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థినుల వీడియోల లీక్‌ దుమారం: స్నానం చేస్తూ నాలుగు వీడియోలు పంపిందంతే!

Published Mon, Sep 19 2022 8:07 AM | Last Updated on Mon, Sep 19 2022 9:15 AM

Chandigarh University video row: Only Self Videos Of Accused Girl - Sakshi

చండీగఢ్‌: అభ్యంతరకర వీడియోల వ్యవహారం పంజాబ్‌ రాష్ట్రం మొహాలీలోని చండీగఢ్‌ యూనివర్సిటీలో తీవ్ర అలజడి సృష్టించింది. యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని.. పలువురు విద్యార్థినుల ప్రైవేట్‌ వీడియోలను మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించి, మరో యూనివర్సిటీలో చదివే తన స్నేహితుడికి పంపించిందని, అతను వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడని, మొత్తంగా 60కి పైనే వీడియోలు వైరల్‌ అవుతున్నాయంటూ పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు యూనివర్సిటీ ప్రాంగణంలో బైఠాయించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి నుంచి వర్సిటీ ప్రాంగణంలోకి ఆందోళన కొనసాగించారు. వారి నినాదాలతో వర్సిటీ అట్టుడికిపోయింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 


ఓ హాస్టల్‌ వార్డెన్‌ వీడియో లీకేజీల గురించి సదరు యువతిని నిలదీయడం.. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో.. పుకార్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు పోలీసులు. వ్యక్తిగత వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆత్మహత్యాయత్నంలో పలువురి పరిస్థితి విషమయంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో కొందరు పెట్టిన పోస్టులను పోలీసులు ఖండించారు. అలాంటిదేమీ జరగలేదన్నారు. ఒక విద్యార్థిని మాత్రం ఆందోళనకు గురై కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించారు. ఈ ఉదంతంలో ఎవరూ చనిపోలేదని.. పుకార్లు నమ్మొద్దని విద్యార్థినులకు సూచించారు. ఈ కేసులో యువతితో పాటు షిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను, ఓ బేకరీలో పని చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో పంపిన విద్యార్థిని  
యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఒక విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తూ తన ఫోన్‌లో రికార్డు చేసుకొని, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌కు(ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు) పంపించినట్లు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఆమె ఫోన్‌లోని అభ్యంతరకర వీడియోలను చూసిన సహచర విద్యార్థినులు, ఆమె తమవి కూడా రికార్డు చేసి అలాగే పంపి ఉంటుందని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మొదలైన అనుమానం.. పెనుదుమారాన్నే లేపింది. నిందితురాలిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా హిమాచల్‌ ప్రదేశ్‌లో అరెస్టు చేశామని అదనపు డీజీపీ గురుప్రీత్‌కౌర్‌ దేవ్‌ తెలిపారు. ఇప్పటిదాకా దర్యాప్తులో నిందితురాలికి చెందిన ఫోన్‌లో ఆమెకు సంబంధించిన నాలుగు వీడియోను గుర్తించామన్నారు. ఇతర విద్యార్థినుల వీడియోలను రికార్డు చేయలేదన్నారు. అయితే.. సదరు యువతి తమను బాత్‌రూంలో ఉండగా దొంగచాటుగా ఫొటోలు తీసిందని ఆరోపిస్తున్నారు కొందరు విద్యార్థులు. అలాగే వార్డెన్‌ ఆమెను నిలదీస్తున్నట్లు వైరల్‌ అయిన వీడియోపై కూడా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు డీజీపీ తెలిపారు. 

పోలీసులను నమ్మాలా?
అయితే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, నిజాలను తొక్కిపెడుతున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున పోరాడుతున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. అయితే, వాళ్లను కట్టడి చేసేందుకు లాఠీచార్జ్‌ ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు.. వీడియోల విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం ఒక విద్యార్థినికి చెందిన వీడియోలు మాత్రమే లీకైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మన బిడ్డలే మనకు గర్వకారణమని, ఈ మొత్తం ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదేశించారు. ఊహాగానాలను విశ్వసించవద్దని సూచిస్తూ ట్వీట్‌ చేశారు.   అభ్యంతరకర వీడియోల వ్యవహారంపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని, నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని పంజాబ్‌లోని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. విద్యార్థినులను మానసిక వేదనకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్‌’ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.  

కఠిన చర్యలు: మహిళా కమిషన్‌
చండీగఢ్‌ వర్సిటీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) స్పష్టం చేసింది. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని పంజాబ్‌ డీజీపీ, చండీగఢ్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌కు కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ లేఖ రాశారు. విద్యార్థినుల ప్రైవేట్‌ వీడియో లీకైనట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ మనీశా గులాజీ వెల్లడించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.  చండీగఢ్‌ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌ స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మన సోదరీమణులకు అండగా నిలవాలని ట్విట్టర్‌లో సూచించారు. ఇది మనందరికీ పరీక్షా సమయమని పేర్కొన్నారు. 

రెండు రోజులు సెలవులు  
క్యాంపస్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో యూనివర్సిటీకి సోమవారం, మంగళవారం అధికారులు సెలవులు ప్రకటించారు. దీనిపై విద్యార్థినులు మండిపడ్డారు. ఏ తప్పూ జరగకపోతే సెలవులు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ఈ ఉదంతంపై లోతైన దర్యాప్తు కోసం సీనియర్‌ మహిళా ఐపీఎస్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసినట్లు  ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వీడియోల అంశంపై ఐపీసీ సెక్షన్‌ 354–సి, ఐటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని అన్నారు.

ఇదీ చదవండి: ఫుల్‌గా తాగి.. స్నేహితుడిపై ఆటో ఎక్కించేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement